టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి... ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్న ముఖ్య నేత. ఎనభైల్లో విశాఖ జిల్లాలో చురుకైన యువనేతగా బండారు ఎనలేని పేరు తెచ్చుకున్నారు. ఆయన మొదట మండలాధ్యక్షుడిగా పనిచేసి 1989లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 1998 నాటికి మంత్రి కూడా అయ్యారు. ఆయన పరవాడలో చాలా సార్లు గెలిచారు.ఇక ఆ తరువాత పెందుర్తిగా మారిన తరువాత 2014లో విజయం సాధించారు. బలమైన నేత సొంత సామాజిక వర్గంలో పట్టున్న నేతయిన బండారుని కాదని జనసేన పార్టీకి ఈ టికెట్ కేటాయించారు. అది కూడా వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన నేతకు ఇచ్చారని పెందుర్తికి చెందిన పక్కా లోకల్ కి టికెట్ నిరాకరించడం ఏమి న్యాయమని టీడీపీ తమ్ముళ్ళు ఇప్పటికీ వాపోతున్నారు.తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ  అన్యాయం చేసిందని బండారు మండిపోయి దండం పెట్టేసారు. చంద్రబాబు విశాఖ పర్యటనలో బండారు ని పిలిపించి మాట్లాడారు. పొత్తులలో భాగంగా సీటు జనసేన పార్టీకి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.


ఈ సందర్భంగా బండారుకు బాబుకు మధ్య కొంత వాదనలు కూడా జరిగాయి. బాబు సరైన హామీ ఇవ్వకుండా బండారుని తగ్గమని పనిచేయమని కోరడంతో తన వల్ల కాదని ఆయన చెప్పేశారు. పెందుర్తి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న  జనసేనకు ఈ పరిణామాలు కలవరపెట్టేలా ఉన్నాయి.సీనియర్ నేత బండారు దారికి రాకపోతే మాత్రం పెందుర్తిలో గాజు గ్లాస్ కి బీటలే అని తెలుస్తుంది. నేల మీద పడితే పదునెక్కడం కాదు పగిలిపోతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఈ పరిణామాలు ఖచ్చితంగా వైసీపీకి అనుకూలించేవే అంటున్నారు. బండారు ఏడు పదుల వయసులో పార్టీ హై కమాండ్ ద్వారా తీరని అవమానానికి గురి అయ్యారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.ఆయన 2014 వ సంవత్సరంలో గెలిస్తే మంత్రి పదవి విస్తరణలో కూడా ఇవ్వలేదని ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదని ఆయన రాజకీయాన్ని టీడీపీ అధినాయకత్వం ఏమి చేయనుందని అనుచరులు అంటున్నారు. ప్రస్తుతానికి  బండారు అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఆయన ఫోన్ లోకి కూడా అందుబాటులోకి రావడం లేదు. దాంతో కూటమికి బండారు పెద్ద షాక్ ఇస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: