ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యే కొలదీ, విపక్షాలు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైస్ షర్మిల దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన తనదైన రీతిలో విరుచుకు పడటం ఇపుడు చర్చనీయాంశమైంది. ఇకపోతే దేశ ప్రజల సొమ్మును కాంగ్రెస్ చొరబాటుదార్లకు జాగ్రత్తగా దోచిపెడుతోందంటూ ప్రధాని మోడీ ఆరోపించిన సంగతి అందరికీ విదితమే. అక్కడితో ఆగకుండా మహిళల మంగళ సూత్రాలను సైతం హస్తం పార్టీ వదిలి పెట్టట్లేదని మోడీ వ్యాఖ్యానించారు. కాగా ఈ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ, ఘాటైన విమర్శలు చేశారు.

ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ''ప్రధాని మోడీ దేశంలో ఏం అభివృద్ధి చేసారు. ఆయన ఇక్కడ చేసిందేదీ లేదు. అలా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక మోడీ సార్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలు తెంచుతామని పలికారు. మతాల మధ్య చిచ్చు పెట్టి వారే ఆ పని చేస్తున్నారు. వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు అని నేను అడుగుతున్నాను? దీనికి వారు సమాధానం చెప్పాలి ముందు. అదే విధంగా ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు?" అని ధ్వజమెత్తారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ... మోడీలా కాదు, రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు. మోడీ మాత్రం మతాలను విడదీసి, చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు అదంతా గమనిస్తూనే వున్నారు. కాబట్టి ప్రధాని మోడీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ముస్లింలను, క్రిస్టియన్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదు. ఇకనుండి అలాంటి మాటలను కట్టిపెడితే మంచిది. ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదకరం. ప్రజలారా ఆలోచించండి అంటూ ఆమె విరుచుకు పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: