చవక చవక... బంపర్ ఆఫర్... ఆలోచించిన ఆశా భంగం! 10 రూపాయలకే 2 క్వార్టర్‌ బాటిళ్లు.. 50 రూపాయలకే ఒక బియ్యం బస్తా! ఆఫర్ అదిరిపోయింది కదా అని అనుకుంటారేమో. మీ ఓట్లను కొనుక్కొనే బేరం అది. అవును, ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థులు ఇపుడు ఓటర్లకు పంచుతున్న తాయిలాల సంతతి అలా ఉంది! పోలింగ్‌ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో ఒక్కో ఓటుకు రూ.3వేలు దాకా పంపిణీ చేయడం జరిగింది. అయినా మార్పు లేకపోవడంతో కొత్త ఎత్తుగడలకు తెర తీశాయి ఆయా పార్టీలు.

ఈ నేపథ్యంలోనే, నగరంలోని డివిజన్లలో మగవారికి ఇబ్బుడిముబ్బడిగా మద్యం, 2 ఓట్లకు ఒక బియ్యం బస్తా పంచడం జరిగింది. బియ్యంతో ఆగకుండా నగరు శివారు కాలనీల్లో నూనె ప్యాకెట్లు కూడా పంచడం కొసమెరుపు. అయితే ఇంత చేసినా వారిలో విజయంపై భరోసా కనిపించడం లేదనేది వాస్తవం. ఈ క్రమంలో 'అవసరమైతే మరో వెయ్యి ఎక్స్ట్రా పంచండి. లేదంటే అల్లర్లకు తెగబడండి, ఓటు మాత్రం వైసీపీకి పడాల్సిందే' అని ఆ పార్టీ పెద్దలు డివిజన్‌ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అవును, ఒంగోలులో వైసీపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు ఓట్లు రాబట్టుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యారు. దానికి హవాలా విధానం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న రూ.పది, ఇరవై, 50నోట్ల సీరియల్‌ నంబర్లు రాసి, ఆ నంబర్ల లిస్టును బార్ల యజమానులకు ఇస్తారు. తర్వాత నోట్లను ఓటర్లకు పంచుతారు. పది నోటు తీసుకుని బార్‌ షాప్‌కు వెళ్తే సీరియల్‌ నంబర్‌ను తన వద్ద ఉన్న లిస్ట్‌తో సరిపోల్చి.. రెండు క్వార్టర్‌ బాటిళ్ల మద్యం అందజేస్తారు. ఇదే మాదిరి రూ.20కి మూడు, రూ.50కి 6 బాటిళ్లు పంపిణీ చేయడం జరుగుతోంది. కాగా విషయం తెలిసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు దాడులు చేసి 2 దుకాణాలను సీజ్‌ చేశారు. పంపిణీ చేస్తుండగా పులి వెంకటరెడ్డి కాలనీలో 554 బస్తాల బియ్యం, లారీని పట్టుకున్నారు. దాంతో కోడ్‌ను ఉల్లంఘించి మరీ దుకాణాల ఎదుట వైసీపీ నాయకులు ఆందోళనకు దిగడం అది వారి దిగజారుడు తనాన్ని గుర్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: