తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నాడు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల పార్టీ అధినేతకు ఆమె రాసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఓ సంచలన లేఖ పెను దుమారం రేపిన నేపథ్యంలో, ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరే కొద్దిసేపటి ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. తండ్రికి సంఘీభావం తెలిపేందుకే కవిత వచ్చినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, ఫామ్‌హౌస్‌ వర్గాల నుంచి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, కేసీఆర్ తన కుమార్తెతో మాటామంతీ జరపలేదని, కనీసం ఆమె వైపు చూడను కూడా చూడలేదని తెలుస్తోంది. 

ఇరువురి మధ్య నెలకొన్న తీవ్రమైన అంతర్గత విభేదాలే ఇందుకు కారణమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య దూరం మరింత పెరిగిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అనంతరం, కేసీఆర్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి హేమాహేమీలతో కూడిన భారీ కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. బయలుదేరే ముందు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ నేత జహంగీర్ సంప్రదాయబద్ధంగా 'ఇమామ్-ఎ-జామిన్' (ధట్టి)ను కేసీఆర్ కుడి చేతికి కట్టారు. ముఖ్యమైన సందర్భాల్లో కేసీఆర్ దీనిని ధరించడం ఆనవాయితీ, ఇది శుభసూచకంగా, విజయాన్ని చేకూరుస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.

ఇదిలా ఉండగా, అదే ఫామ్‌హౌస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి అకస్మాత్తుగా కాలుజారి పడిపోవడంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ వరుస పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో అసలేం జరుగుతోందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: