ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యా విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల నిర్మాణానికి స్వస్తి పలుకుతూ, విద్యార్థుల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా సబ్జెక్టులు ఎంచుకునే స్వేచ్ఛను కల్పించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు ఎంపీసీ గ్రూపు అంటే గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం తప్పనిసరి. బైపీసీ గ్రూపు అంటే జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం తప్పనిసరి. కానీ కొత్త విధానంలో ఈ కఠినమైన బంధనలు తొలగిపోయాయి. ద్వితీయ భాష స్థానంలో ఎలక్టివ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టుల జాబితాలోనుంచి తమకు నచ్చినది ఎంచుకునే అవకాశం కలిగింది. దీని ఫలితంగా ఇప్పటివరకు ఊహించని “ఎంబైపీసీ” గ్రూపు రూపుదిద్దుకుంది.


ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 11,257 మంది విద్యార్థులు ఎంబైపీసీ వైపు మొగ్గు చూపడం గమనార్హం. వీరిలో 7,400 మంది బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంచుకోగా, 3,613 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని ఎంచుకున్నారు. ఇంతవరకు వేర్వేరుగా ఉన్న రెండు విభాగాలను కలిపి చదివే అవకాశం దొరకడంతో విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలలో ఒకేసారి చ‌దివే ఛాన్స్ వ‌చ్చింది. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో 5,40,924 మంది విద్యార్థులు చేరారు. కోర్సుల నిర్మాణంలోనూ బోర్డు మార్పులు చేసింది. ఎంపీసీలో ఎ, బి లుగా ఉన్న గణితాన్ని ఒకే సబ్జెక్టుగా మార్చగా, బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా తీసుకువచ్చింది. దీని వల్ల‌ ఇకపై అన్ని గ్రూపుల్లోనూ ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉండనున్నాయి. ఇది బోధన, పరీక్షా విధానంలో సరళతకు దోహం చేయ‌నుంది.


అలాగే పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు గణితం, జీవశాస్త్రం ఒకే రోజున జరిగేవి. కానీ ఎంబైపీసీ విద్యార్థులకు ఇది సాధ్యం కానందున, ఇకపై రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల‌ పరీక్షల వ్యవధి పెరుగుతుందని, అందుకే మార్చి బదులు ఫిబ్రవరి నుంచే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం మీద ఈ సంస్కరణలు విద్యార్థులకు విస్తృత అవకాశాలను అందిస్తున్నాయి. ఒకే సమయంలో ఇంజినీరింగ్, మెడికల్ వంటి వేర్వేరు రంగాలలో తమ ప్రతిభను పరీక్షించుకునే అవకాశాన్ని కల్పించడం వల్ల, భవిష్యత్తులో కెరీర్‌ ఎంపికలో మరింత స్వేచ్ఛ లభించనుంది. రాష్ట్ర విద్యా చరిత్రలో ఇవి నిజమైన విప్లవాత్మక మార్పులుగా నిలుస్తాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: