ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, అంగన్వాడీ రంగాల్లో సమస్యలు తలెత్తడంతో నిరసనలు, ఉద్యమాలు జోరందుకుంటున్నాయి. వీటికి ప్రధాన కారణం గతంలోనే నిలిచిపోయిన బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొదటగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. వైసీపీ హయాంలో మూడు క్వార్టర్ల ఫీజు బకాయిలు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మరో మూడు క్వార్టర్లు చేరడంతో మొత్తం బకాయిలు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.


గతంలో జగన్ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని అనుసరించగా, కొత్త ప్రభుత్వం మళ్లీ కాలేజీల ఖాతాల్లోకి నేరుగా సొమ్ములు జమ చేసే విధానాన్ని అమలు చేస్తోంది. అయితే విధానం మార్చినా డబ్బులు ఇవ్వకపోవడంతో మొత్తం బకాయిలు ఇప్పుడు రూ.4,200 కోట్లకు చేరాయి. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలు స్పష్టంగా చెబుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఈ సమస్యను తగ్గించాలంటే కనీసం రూ.2,000 కోట్లు తక్షణం విడుదల చేయాల్సి వస్తుందని అధికారులు లెక్కలు గణించారు. రెండవది, ఆరోగ్యశ్రీ. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం నిలిచిపోవడం మరో పెద్ద సంక్షోభంగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని, రూ.2,500 కోట్ల బకాయిలు క్లియర్ చేయకపోతే వైద్యం చేయబోమని ప్రకటించాయి. దీని వల్ల పేద రోగులు నానా కష్టాలు పడుతున్నారు.


మూడవది, అంగన్వాడీ కార్యకర్తల సమస్య. వారు బకాయి వేతనాలతో పాటు వేతనాల పెంపు విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈనెల 30 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే నోటీసులు ఇచ్చేశారు. దీనికి సుమారు రూ.1,000 కోట్ల భారమని అంచనా వేస్తున్నారు. ఈ మూడు అంశాలను కలిపితే దాదాపు రూ.7,000 కోట్లు అవసరం అవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం, కనీసం రూ.10,000 కోట్లు కేటాయిస్తే తక్షణ సమస్యలు తగ్గుతాయని అభిప్రాయం. ఇప్పుడు సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం. రెండు మూడు రోజుల్లో ఫండ్స్ విడుదల చేస్తే పరిస్థితి సాధారణ స్థితికి చేరే అవకాశముందని భావిస్తున్నారు. లేని పక్షంలో నిరసనలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మొత్తానికి, ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఆర్థికపరంగానే కాక ప్రజా నమ్మకానికి కూడా పరీక్షగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: