
రాజకీయాల్లోకి యువనాయకుడిగా ప్రవేశించిన దామన్న.. ఒకానొక దశలో ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా, "కన్నతల్లి కాంగ్రెస్" అని గర్వంగా ప్రకటించి.. తన పార్టీని వదల్లేదు. పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించినప్పుడు కూడా స్వతంత్రంగా పోటీ చేశారు తప్ప, ఇతర పార్టీల వైపు వెళ్లే ఆలోచన కూడా చేయలేదు. కాంగ్రెస్ పట్ల ఆయనకున్న ఈ విశ్వాసమే నేటి వరకు పార్టీ వర్గాల్లో ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చింది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ను నిలబెట్టడం అంత సులువైన పని కాదు. కానీ 1985లో తొలిసారి తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ విజయంతోనే కాంగ్రెస్ కేడర్‌లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత వరుసగా విజయాలు సాధించిన ఆయన.. 1999లో ఒక్కసారి పరాజయం పాలయ్యారు.
అయితే 2004, 2009లో మళ్లీ కాంగ్రెస్ టికెట్ పొంది ఘన విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019, 2023 ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురైనా.. పార్టీ పతాకాన్ని మాత్రం వదల్లేదు. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా చురుకుగా వ్యవహరించారు. చివరి వరకు కాంగ్రెస్ కోసమే పోరాడారు. సాధారణ జీవితాన్ని గడిపిన దామన్న, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, ప్రజలతో మమేకమయ్యే శైలి కలిగిన నేత. అందుకే ఆయనకు నల్లగొండ జిల్లాలో అఖండ ప్రజాదరణ లభించింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి, నల్లగొండ జిల్లాకు తీరని లోటు. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు.. విశ్వాసానికి, కట్టుబాటుకు ప్రతీకగా నిలిచారు. ఒక తరం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచిన దామన్న.. ఇప్పుడు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు.