అందెశ్రీ పూర్తి పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని మద్దూరు గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన ఆయనను తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చదువు మధ్యలోనే ఆగిపోయినా, గ్రామీణ జీవన పద్ధతులు, పల్లె పాటలు, జానపద సాహిత్యం ఆయన హృదయంలో అక్షరాలా చెరగని ముద్ర వేశాయి. ఆ జానపద మూలాలతోనే ఆయన కవిత్వం, పాటలు, రచనలు రూపుదిద్దుకున్నాయి.తెలంగాణ ఉద్యమం మంటలు రగిలించిన సమయంలో, అందెశ్రీ కవిత్వం ఆ ఉద్యమానికి ఊపిరి ఇచ్చింది. ఆయన రచించిన పద్యాలు, పాటలు, ప్రసంగాలు ప్రజల్లో అవగాహన కలిగించాయి, ఉద్యమానికి బలాన్ని చేకూర్చాయి. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన ఆయన రచనల్లో అగ్రగణ్యంగా నిలిచింది రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ’. ఈ గీతం ద్వారా ఆయన తెలంగాణ ప్రజల గళంగా మారారు.
శృంగేరి మఠాధిపతి శంకర మహాస్వామి ఆయన పాటలు విని ఎంతో ప్రశంసించారు. అందెశ్రీ సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించారు. 2006లో విడుదలైన గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం సంభాషణలు రచించారు. విప్లవాత్మక భావాలతో కూడిన అనేక సినిమాలకు ఆయన పాటలు అందించారు. ఆయన పద్యాలలో జ్వలించే తెలంగాణ ఆత్మ ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకేది.
అందెశ్రీ సాహిత్య ప్రస్థానం అనేక పురస్కారాలతో అలంకరించబడింది. ఆయనకు లభించిన ముఖ్యమైన అవార్డుల్లో —
2006: నంది పురస్కారం (గంగ సినిమాకు పాటలు రాసి)
2014: అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
2015: దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
2022: జానకమ్మ జాతీయ పురస్కారం
2024: దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోకనాయక్ పురస్కారం
ఇతర అనేక సాహితీ, జాతీయ స్థాయి సత్కారాలు ఆయనను అలంకరించాయి. ఎన్ని అవార్డ్స్ వచ్చిన ఆయనకి ప్రత్యేకంగా నిలిచింది మాత్రం..కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ లభించడం ఆయనకు అత్యంత గర్వకారణంగా నిలిచింది. అశువుగా కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. వేదికపై నిలబడి క్షణాల్లోనే సామాజిక సందేశం కలిగిన పద్యాలను చెప్పగలిగే ప్రతిభ ఆయన సొంతం. ఆయన వాణీ వింటే ప్రజలు ఉప్పొంగిపోతారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కవితలు, పాటలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.గత జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయనకు కోటిరూపాయల నగదు పురస్కారం అందింది. ఇది ఆయనకు జీవితంలో చివరి పెద్ద సత్కారం అయింది.తెలంగాణ కవి, ప్రజా ఉద్యమకారుడు, రచయిత, గీతకారుడు అయిన అందెశ్రీ మృతి తెలుగు సాహిత్యానికి, తెలంగాణ ఆత్మకు అపూర్వ నష్టం. ఆయన రచనలు, ఆలోచనలు, తెలంగాణపై ప్రేమ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి