ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరగబోతోంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టు హాజరుతో సీన్ పూర్తిగా మారబోతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఈ నెల నవంబర్ 21న ఏసీబీ (సీబీఐ) కోర్టులో హాజరుకానున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ పరిణామంతో రాజకీయ వర్గాలు మరోసారి కదిలిపోయాయి. ఇక వివరాల్లోకి వెళ్తే- జగన్‌ గతంలోనే యూరప్ పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చినా, నవంబర్ 14న తిరిగి వచ్చాక స్వయంగా హాజరుకావాలని షరతు పెట్టింది. కానీ ఆ తేదీకి ఆయన హాజరు కాలేదు.


ఇక‌ తరువాత నవంబర్ 6న మరోసారి మెమో దాఖలు చేసి హాజరుకు మినహాయింపు కోరారు. అయితే ఇప్పుడు జగన్ స్వయంగా కోర్టుకు సమాచారం ఇచ్చి “నవంబర్ 21లోపు హాజరవుతాను” అని తెలియజేశారు. దీంతో ఆయన ఈ నెల 21న కోర్టుకు స్వయంగా హాజరవడం ఖాయమైంది. రాజకీయంగా ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే, జగన్ ప్రతి సారి ఈ కేసులో కోర్టు హాజరయ్యే సందర్భం వస్తే రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారుతుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు, అభిమానులు, ప్రతిపక్ష నేతలు అందరూ ఈ హాజరుపై కన్నేసి ఉంటారు. గతంలో కూడా ఇలాంటి హాజరుల సందర్భంలో కోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లు పెంపొందించిన ఘటనలు ఉన్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ హాజరు కేవలం న్యాయపరంగానే కాకుండా రాజకీయ ప్రాధాన్యం కూడా సంతరించుకుంది.


ఇటీవల జగన్ యూరప్ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన పూర్తయ్యాక వెంటనే హాజరవుతానని చెప్పడం ద్వారా జగన్ ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలు “జగన్ ఎప్పుడూ చట్టాన్ని గౌరవించే నాయకుడు. కోర్టు పిలిస్తే తప్పకుండా హాజరవుతారు” అంటూ సమర్థిస్తున్నాయి. మరోవైపు టిడిపి, జనసేన వర్గాలు మాత్రం “జగన్ భయంతో హాజరవుతున్నారు. కేసులు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి” అంటూ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా, నవంబర్ 21న జగన్ కోర్టు హాజరు చుట్టూ రాజకీయ వేడి తప్పదనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ న్యాయసభ నుండి ప్రజాసభ దాకా జగన్ పేరే చర్చనీయాంశం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: