కర్ణాటక రాజ‌కీయాలు మ‌రోసారి కీల‌క మ‌లుపు తీసుకోబోతున్నాయా? ముఖ్య‌మంత్రి పీఠంపై క‌న్నేసిన డీకే శివ‌కుమార్ (డీకేఎస్‌)కు కాంగ్రెస్ హైక‌మాండ్ స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చేసింది! ప్ర‌స్తుతం ఉన్న ముఖ్య‌మంత్రిని మార్చే ప్ర‌సక్తే లేద‌ని, పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స్వ‌యంగా ఇద్ద‌రు నేత‌ల‌ను ఇంటికి పిలిచి తేల్చిచెప్పేశారు. హైక‌మాండ్ నిర్ణ‌య‌మే శిరోధార్య‌మ‌ని డీకేఎస్ చెప్పిన‌ప్ప‌టికీ ... ఆయ‌న ప‌డ్డ అసంతృప్తి రాబోయే రోజుల్లో క‌న్న‌డ రాజ‌కీయాలను ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపు తిప్పే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి!


నెత్తిన చెయ్యి పెట్టిన కాంగ్రెస్ 'వ్యూహం :
గ‌త ఐదేళ్లుగా పార్టీ కోసం తాను ప‌డ్డ క‌ష్టాన్ని గుర్తించి సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని డీకేఎస్ హైక‌మాండ్‌ను బ్ర‌తిమాలిన‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సీఎంను మార్చే ప్ర‌శ్నే లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ గెలిస్తే మీరే సీఎం అవుతారంటూ ఖ‌ర్గే చెప్ప‌డం.. డీకేఎస్ ఆశ‌ల‌పై తాత్కాలికంగా నీళ్లు చ‌ల్లిన‌ట్లైంది. సమర్థులైన నేత‌ల‌కు కాకుండా... త‌మ‌కు విధేయంగా ఉండి వంగి, వంగి దండాలు పెట్టేవారికే కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుందనే పాత విమ‌ర్శ‌ ఈ ప‌రిణామంతో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.



డీకేఎస్ కోసం బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్! :
ఒక వైపు డీకేఎస్‌ను కాంగ్రెస్ ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌క్క‌న పెడుతుంటే... మ‌రోవైపు కర్ణాట‌క బీజేపీ మాత్రం సైలెంట్‌గా మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది! య‌డ్యూర‌ప్ప రిటైర్మెంట్ త‌ర్వాత కర్ణాట‌క బీజేపీ ఒక బ‌ల‌మైన నాయ‌కుడి కోసం తీవ్రంగా వెతుకుతోంది. ఈ స‌మ‌యంలోనే మాస్ ఇమేజ్, సామాజిక వ‌ర్గాలు అండ‌గా ఉన్న డీకేఎస్‌ బీజేపీకి కరెక్ట్ చాయిస్గా క‌నిపిస్తున్నారు. పార్టీ గెల‌వాలంటే ఎలాంటి నేత‌లు అవ‌స‌ర‌మో బాగా తెలిసిన బీజేపీ పెద్ద‌లు... శివ‌కుమార్ కోసం ఓపిక‌గా ఎదురుచూసే వ్యూహాన్ని ప్రారంభించారు.



సీఎం అవ్వాలంటే ఒకే దారి! :
హైక‌మాండ్ ద‌యాదాక్షిణ్యాల కోసం వేచి చూడాల్సిన ప‌నిలేకుండా, శివ‌కుమార్‌కు సీఎం కుర్చీ ద‌క్కించుకోవ‌డానికి ఒక ఈజీ మార్గం కూడా ఉంది. డీకేఎస్ గ‌నుక మ‌హారాష్ట్ర స్టైల్‌లో వెంట‌నే త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి... ప్రత్యేక గ్రూపుగా ఏర్ప‌డితే బీజేపీ మద్ద‌తుతో త‌క్ష‌ణ‌మే సీఎం అయిపోతారు. ఈ వ్యూహం అమ‌లైతే కాంగ్రెస్ కేవ‌లం 50-60 మంది ఎమ్మెల్యేల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. కాంగ్రెస్ హైక‌మాండ్ తీసుకున్న ఈ నిర్ణ‌యం... డీకేఎస్ కోసం BJPకి గోల్డెన్ ఛాన్స్ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: