భారత ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై ఇప్పుడు ప్రపంచ స్థాయి సంస్థ నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఏమాత్రం ఊహించని విధంగా, ఐక్యరాజ్యసమితిలోని మీడియా విభాగం ప్రపంచవ్యాప్త మీడియాపై నిర్వహించిన సర్వేలో మన దేశంలోని మీడియాపై షాకింగ్ నిజాలు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా మీడియాలో ఒక "స్తబ్దత" రాజ్యమేలుతోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని నివేదిక తేల్చి చెప్పింది.


2014 తర్వాతే 'స్తబ్దతస :
భావ ప్రకటనా స్వేచ్ఛకు అగ్రతాంబూలం ఇచ్చే భారత్ వంటి దేశంలో.. మీడియాకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, 2014 తర్వాత మాత్రం మీడియా స్తబ్దతకు తార్కాణంగా మారిందనేది ఐక్యరాజ్యసమితి విశ్లేషణలో కీలక అంశం. అంతకుముందు, 2-జీ స్పెక్ట్రమ్ కుంభకోణం లాంటి భారీ అవకతవకలను స్థానిక మీడియా సంస్థలే ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన విషయాన్ని ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. కానీ, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయి.



నిజాలు దాచిన దేశీయ మీడియా: ఉదాహరణలివే! :
దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద పరిణామాలను కూడా ప్రపంచ దేశాల మీడియా ప్రొజెక్టు చేసేంత వరకు స్థానిక మీడియా బయటపెట్టలేకపోవడం ఈ స్తబ్దతకు పరాకాష్టగా నివేదిక పేర్కొంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సెకీ (SECI) ఒప్పందం, ఆ క్రమంలో చేతులు మారిన సొమ్ము వివరాలు... అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ వెలికి తీసే వరకు బయటకు రాలేదు. అదేవిధంగా, గౌతమ్ అదానీకి ఎల్ఐసీ షేర్ల బదలాయింపు వంటి అతి కీలకమైన వ్యవహారం కూడా ఫ్రెంచ్ పత్రిక బట్టబయలు చేసే వరకు వెలుగు చూడకపోవడం మన దేశ మీడియా పాలిట ఒక కచ్చితమైన ప్రశ్నార్థకం.



 'ఆర్గనైజేషనల్ పరాలసిస్' కారణమా? :
స్థానిక మీడియా సంస్థల్లో 'విధానపరమైన పక్షపాతం' (Organizational Paralysis) కొనసాగుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టంగా తెలిపింది. దీని అర్థం, సంస్థాగత నిర్ణయాలు, పాలకుల పట్ల ఉండే అనుకూలత కారణంగా.. నిజాలను నిర్భయంగా చెప్పే పద్ధతికి మీడియా తిలోదకాలిచ్చిందనే తీవ్రమైన ఆరోపణ. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన అంశమని సమితి అభిప్రాయపడడం గమనార్హం. ఒకవైపు 'విశ్వగురువు'  గా ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న వేళ, నాల్గో స్తంభమైన మీడియాలో నెలకొన్న ఈ 'స్తబ్దత' దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య మూలాలను ఎంత వరకు దెబ్బతీస్తుందో అనేది ఇప్పుడు మేధావులను వేధిస్తున్న ప్రశ్న. మీడియా నిజాయితీపై వస్తున్న ఈ విమర్శలకు దేశీయ మీడియా సంస్థలు ఏం సమాధానం చెప్తాయో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: