భారత రూపాయికి, అమెరికన్ డాలర్‌కు మధ్య జరుగుతున్న ఈ ఆర్థిక యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. రూ.75, 80, 85, 88 గీతలను దాటుకుంటూ వచ్చిన మన రూపాయి, ఈరోజు చరిత్రలోనే అత్యంత కనిష్టానికి పడిపోయింది. రూ.90.32 పైసలు అనే ఈ భయానక అంకె దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కొన్నేళ్ల క్రితం డాలర్ విలువ రూ.65 ఉన్నప్పుడు, యూరో విలువ రూ.80-90 మధ్య ఉండేది. కానీ, నేడు రూపాయి ఆ యూరో స్థాయిని కూడా దాటేసి, కలలో కూడా ఊహించని దయనీయ స్థితికి చేరింది.

"డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ రూ.100కు చేరిపోతుందా?" అనే భయం ఇప్పుడు ప్రతి భారతీయుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇది కేవలం ఒక ఊహాజనిత భయం కాదు, ప్రస్తుత పతనం చూస్తుంటే, ఆ రూ.100 లక్ష్యం చేరుకోవడం కేవలం సమయం మాత్రమే అనే భయానక రియాలిటీ కమ్ముకుంటోంది. రూపాయి విలువ పడిపోతున్న ప్రతి పైసా... మన దిగుమతుల భారాన్ని, పెట్రోల్, డీజిల్ ధరల మంటను, ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోంది.

గ్లోబల్ గేమ్‌లో రూపాయి నిస్సహాయత!
అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా రూపాయి పతనానికి ఆజ్యం పోస్తున్నాయి. ఓవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25% మేర తగ్గించింది. అంతేకాక, 2026లో మరోసారి వడ్డీ రేట్ల కోతకు సంకేతాలు ఇవ్వడం, 10 ఏళ్ల బాండ్ల ప్రతిఫలాలు తగ్గడం మూలంగా... విదేశీ సంస్థాగత మదుపరుల (FII) అమ్మకాలు భవిష్యత్తులో నిదానిస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు సానుకూల అంశాలుగా కనిపిస్తున్నా, వాస్తవంలో మాత్రం రూపాయిని కాపాడలేకపోతున్నాయి. ఈ గ్లోబల్ ఆర్థిక అస్థిరత ముందు మన దేశ కరెన్సీ నిస్సహాయంగా నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం మౌనం దేనికి సంకేతం?
అసలు రచ్చ అంతా ఇక్కడే ఉంది! ఇంతటి చారిత్రక పతనం జరుగుతున్నా, రూపాయిని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం కూడా చేయడం లేదనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ పతనాన్ని కంట్రోల్ చేయాల్సిన రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటం దేనికి సంకేతం? ఆర్థిక విశ్లేషకులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా, పాలకులు మౌనం వహిస్తే, విపరీతమైన దిగుమతుల భారం, విదేశీ రుణాల భారం దేశంపై పడటం ఖాయం.రూ.100 వైపు రూపాయి పరుగు ఆగేదెప్పుడు? ఈ ఆర్థిక సంక్షోభంపై ప్రభుత్వం ఎప్పుడు నోరు విప్పుతుంది? సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న ఈ పతనాన్ని అడ్డుకోవడానికి నియంత్రణ మండలి ఎలాంటి మాస్ యాక్షన్ ప్లాన్ చేస్తుందో వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: