ఎలాగైనా అధికారంలోకి రావలన్న పట్టుదలతో ఇప్పటి నుంచే ఉచిత హామీల జపం చేస్తున్నాయి అన్ని పార్టీలు. కరెంటు, రుణమాఫీల్ని దాటి ఉచితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు నాయకులు. ఈ ఉచిత హామీలను కూడా పక్క రాష్ర్టం తమిళనాడు నుంచి కాపీ కొడుతున్నట్టే ఉంది. ఇప్పటికే రుణాల మాఫీ హామీతో సంచలనం రేపుతున్న చంద్రబాబు.. మరో ఉచితాన్ని హామీ ఇచ్చేశారు. తమిళనాడు తరహాలో ఫ్రీ లాప్ టాప్ లు ఇస్తానని ప్రకటించారు. అధికారంలోకి వస్తే విద్యార్ధులందరికీ లాప్ టాప్ లు ఇస్తానంటున్నారు. తమిళనాడులో కరుణానిధి కలర్ టీవీలు అన్నప్పుడు ఏం పంచుతార్లే అనుకున్నారంతా. కానీ అధికారంలోకి రాగానే పంచి చూపించారాయన. జయలలిత మిక్సీలు, గ్రైండర్లు, ల్యాప్ టాప్ లు అన్నప్పుడు కూడా అలానే అనుకున్నారు. కానీ ఆమె కూడా అన్నమాట ప్రకారం అన్నీ పంచేశారు. ఎవరి ప్లాన్ వారిది.. చంద్రబాబు రుణమాఫీ హామీకి వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఫ్రీ డైలాగ్ నే ఫాలో అవుతున్నారు. 10వేల కోట్ల కన్నా ఖర్చు కాదంటూ తెలంగాణలో కొత్త కొత్త హామీలు గుప్పిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొత్త హామీలేం వినిపించడం లేదు. జగనన్న జైలు నుంచి బైటకొస్తే మీ కష్టాలు తీరుతాయనే మాట తప్ప.. కొత్తగా ఆ పార్టీ నేతలు ఇస్తున్న హామీలేం లేవు. ఒకప్పటి వైఎస్ హామీల్నే ఆ పార్టీ నమ్ముకుంటోంది. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం హామీల విషయంలో ప్రతిపక్షాలతో పోటీపడుతున్నారు. కొత్త కొత్త పధకాలతో అన్ని వర్గాల్ని ఆకట్టుకునేందుకు ఎత్తుగడలు సిద్ధం చేసుకుంటున్నారు.  'ఆల్ ఫ్రీ'తో పెను భారం.. మొత్తానికి బరిలో ఉన్న నాలుగు పార్టీలూ ఉచితాల్నే నమ్ముకుంటున్నాయి. ఫ్రీ ఫార్ములాకి ఓటరు గుడ్డిగా ఓటేస్తాడన్నదే అందరి నమ్మకం. అధికార పీఠమెక్కేందుకు అడ్డంగా హామీలు గుప్పించే నాయకులు.. వచ్చాక ఎలాగోలా వాటిని నెరవేరుస్తున్నారు. అయితే వీరి ఉచితాలతో రాష్ట్రంపై ఆర్ధికంగా ఎంత భారం పడబోతుందన్నదే సమస్య. కొత్త పథకాల్ని అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచనే ఏ నాయకుడికీ ఉన్నట్టు కనిపించడం లేదు. గత ఫ్రీ పథకాలు ప్రజలకు మేలు చేశాయో లేదో కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలో పడేశాయి. ఇక కొత్త హామీలు అమలైతే రాష్ట్రాన్ని ఎవరికో ఒకరికి తాకట్టు పెట్టడమే మిగిలుంది. ఏడాది ముందే హామీల హంగామా ఈ స్థాయిలో ఉంటే.. ఎన్నికలు దగ్గర పడితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం కావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: