
శివారాధన – ఉపవాసం – దీపారాధన:
కార్తీక మాసం అంటేనే భక్తి, నియమం, పవిత్రత కలయిక. భక్తులు ఈ మాసమంతా ఒక్కపూటే భోజనం చేస్తారు. ప్రతీ ఉదయం స్నానమాచరించి, శివాలయాలకు వెళ్లి రుద్రాభిషేకాలు చేస్తారు. సాయంత్రం సమయానికి కార్తీక దీపం వెలిగించడం ఈ మాసపు ముఖ్య ఆచారం. ప్రత్యేకంగా కార్తీక సోమవారాలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజులు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి, రాత్రికి శివపూజ అనంతరం ఫలాహారంతో ఉపవాసం ముగిస్తారు.
పుణ్యక్షేత్ర యాత్రలు – నదీ స్నానాలు:
కార్తీక మాసం వేళ తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి, మహానంది వంటి పవిత్ర క్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తారు. ఈ కాలంలో నదీ స్నానం చేయడం, ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదుల్లో దీపాలను వదిలి పుణ్యస్నానం చేయడం శ్రేష్ఠమైన ఆచారంగా భావిస్తారు.
తులసి దీపం – లక్ష్మీ కటాక్షం:
ప్రతి ఉదయం మహిళలు స్నానమాచరించి, తులసి కోట వద్ద దీపం వెలిగించడం ఈ మాసపు ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక. దీపారాధనతో ఇల్లు పవిత్రమవుతుందని, దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపాలు వెలిగించి, దేవాలయాల్లో లేదా నదుల్లో వదిలితే సంవత్సరాంతం పాపాలు పోతాయని శాస్త్రవాక్యాలు చెబుతున్నాయి.
భక్తి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శాంతి:
ఈ మాసంలో మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండి, నియమ నిష్ఠలతో శివారాధన చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక శాంతి కలుగుతుంది. కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని విశ్వాసం. మొత్తానికి – కార్తీక మాసం అనేది కేవలం పూజల మాసం కాదు, మనసు పవిత్రం చేసుకునే ఆధ్యాత్మిక యాత్ర!