
అసలు విషయం ఏంటంటే.. రెండేళ్ల కిందట, 2023లో పరాగ్ "ఈ ఏడాది ఐపీఎల్‌లో నేను ఒకే ఓవర్లో 4 సిక్సర్లు కొడతానని అనుకుంటున్నాను." అని పోస్ట్ చేశాడు. అప్పుడు అతను అలా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏకంగా వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి తన అంచనాలను తనే మించిపోయాడు. దీంతో ఫ్యాన్స్ ఆ పాత పోస్ట్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, "అనుకున్నదానికంటే ఎక్కువే సాధించావ్ భయ్యా" అంటూ పరాగ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.
అసలు పరాగ్ ఈ అరుదైన ఫీట్ ఎలా సాధించాడో చూద్దాం. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి కేవలం 102 పరుగులతో కష్టాల్లో ఉంది. ఇక 13వ ఓవర్ వేయడానికి మొయిన్ అలీ వచ్చాడు. మొదటి బంతికి షిమ్రాన్ హెట్‌మైర్ సింగిల్ తీసి పరాగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. పరాగ్ ఇక రెచ్చిపోయాడు. లాంగ్-ఆన్, స్క్వేర్-లెగ్ మీదుగా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాదేశాడు.
పరాగ్ జోరు చూసి బెంబేలెత్తిన మొయిన్ అలీ ఒత్తిడిలో ఓ వైడ్ వేశాడు. ఆ తర్వాత వేసిన లీగల్ బంతిని కూడా పరాగ్ వదల్లేదు. లాంగ్-ఆఫ్ మీదుగా స్టైలిష్‌గా మరో సిక్స్ కొట్టాడు. దీంతో వరుసగా 5 లీగల్ బంతుల్లో 5 సిక్సర్లు పూర్తయ్యాయి. తర్వాతి ఓవర్ (14వ ఓవర్) వేయడానికి వరుణ్ చక్రవర్తి వచ్చాడు. మళ్లీ మొదటి బంతికే హెట్‌మైర్ సింగిల్ తీసి పరాగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు.
ఈసారి పరాగ్ ఓ అద్భుతమైన రివర్స్ స్వీప్‌తో బంతిని బౌండరీ దాటించాడు. ఇది వరుసగా ఆరో బంతికి ఆరో సిక్స్. ఐపీఎల్ చరిత్రలో ఇలా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. అయితే, పరాగ్ ఇంత గొప్పగా ఆడినా, దురదృష్టవశాత్తూ రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
పరాగ్‌కు ముందు ఐపీఎల్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన హీరోల్లో క్రిస్ గేల్ (IPL 2012) ఒకడు. RCB తరఫున ఆడుతూ పూణే వారియర్స్‌పై రాహుల్ శర్మ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. రింకూ సింగ్ (IPL 2023) కూడా గుజరాత్ టైటాన్స్‌పై చివరి 5 బంతుల్లో 28 పరుగులు అవసరమైనప్పుడు, యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి KKRకు విజయాన్ని అందించాడు. కానీ, ఇప్పుడు వీళ్లందరినీ దాటేసి, సరికొత్త ఐపీఎల్ రికార్డుతో రియాన్ పరాగ్ టాప్‌లో నిలిచాడు, 6 బంతుల్లో 6 సిక్సర్లు.