
ప్లేఆఫ్స్ కు ముందు హేజిల్ వుడ్ రీ ఎంట్రీ RCB అభిమానులకు బంపర్ గిఫ్ట్ లా మారింది. గతంలో గాయం కారణంగా టీమ్ నుంచి తప్పుకున్న హేజిల్ వుడ్ మధ్యలో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అంతేకాదు, ఐపీఎల్ సీజన్‌లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తొమ్మిది రోజుల బ్రేక్ రావడంతో అతని రాకపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ సంశయాలకు తెరదించుతూ, మే 25న జట్టుతో చేరబోతున్నట్టు ధ్రువీకరించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం.
ఇకపోతే, ఈ సీజన్‌లో హేజిల్ వుడ్ రాణించడమే కాదు.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు అతడు 10 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీసి జట్టులో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ లిస్ట్ లో నిలిచాడు. అతడి మళ్లీ జట్టులోకి రాకతో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ మరింత బలపడనుంది. హేజిల్ వుడ్ లాంటి అంతర్జాతీయ అనుభవజ్ఞుడైన పేసర్ ప్లేఆఫ్స్ వంటి కీలక సమయంలో జట్టులో ఉండటం గొప్ప శుభవార్తగా పరిగణించవచ్చు.
ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మిగిలిన రెండు లీగ్ మ్యాచుల్లో సన్‌రైజర్స్ (మే 23), లక్నో (మే 27) న తలపడనుంది. మే 29న ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ ముందు హేజిల్ వుడ్ జట్టుతో కలవడం RCB వ్యూహాలకు పెద్ద సపోర్ట్ అవుతుంది.
ఈ సీజన్‌లో కొంతకాలం ఆటకు బ్రేక్ రావడం, గాయాలు, అనూహ్య ఆటగాళ్ల రాణింపుతో టోర్నీ ఎన్నో ట్విస్టుల మధ్య కొనసాగుతోంది. అత్యంత సమర్థవంతంగా ఆడిన జట్లలో RCB కూడా ఒకటి. బ్యాటింగ్‌లో స్థిరత, బౌలింగ్‌లో రాణించడం వీరి విజయం వెనుక కీలక అంశాలుగా మారాయి. ప్లేఆఫ్స్ కు ముందే హేజిల్ వుడ్ తిరిగి రావడం RCB కి రన్ అప్ లో మరింత ధైర్యాన్ని ఇస్తుంది. టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉన్న ఆ జట్టుకు ఇది ఓ తీపి శుభవార్తగా నిలిచింది. హేజిల్ వుడ్ బౌలింగ్ అస్త్రంగా చెలరేగితే, RCBకు ఈసారి ట్రోఫీ అందించగలదనే నమ్మకాన్ని అభిమానులు మరోసారి వ్యక్తం చేస్తున్నారు.