ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ పాకిస్థాన్, పీఓకేలో ఉగ్ర‌శిభిరాల‌పై మిసైల్ దాడులు చేసింది. ఈ దాడుల‌పై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటూ కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కలిసి మీడియా ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీంతో మహిళ, చిన్న‌వ‌య‌సులోనే క‌ల్న‌ల్‌గా ఎదిగిన సోఫియా ఖురేషి ఎవరా అని చాలా మంది గూగుల్ చేస్తున్నారు.

సోఫియా గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ సోఫియా ఖురేషి 2016లో చిన్నవయసులోనే బహుళజాతి సైనిక విన్యాసాలలో ఆర్మీ బృందానికి నాయ‌క‌త్వం వ‌హించి చ‌రిత్ర సృష్టించిన మొట్టమొదటి మహిళా అధికారిణిగా నిలిచారు. ప్ర‌స్తుతం ఆమె ఆర్మీలో కార్ప్స్ ఆఫ్ సిగ్న‌ల్స్ ఆఫీస‌ర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు భారత్ నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాల్లో ఒకటి అయిన ఎక్సర్ సైజ్ ఫోర్స్ 18లో సోఫియా పాల్గొన్నారు.

ఈ విన్యాాసాల్లో ఇండియాతో పాటూ జపాన్,చైనా, రష్యా, అమెరికా, కొరియా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాతో పాటూ మరికొన్ని ఏషియన్ దేశాల సభ్యులు పాల్గొన్నారు. 2006లో సోఫియా కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో పనిచేశారు. సైన్యం నుండి అనేమంది శాంతి పరిరక్షక మిషన్‌లో పనిచేసేందుకు ట్రైనింగ్ తీసుకోగా సోఫియాను ఎంపిక చేశారు.

2010 నుండి ఆమె శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. సోఫియా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె గుజరాత్‌కు చెందినవారు. బయెకెమిస్ట్రీలో పీజీ పట్టా పొందారు. సోఫియా తాత కూడా భారత సైన్యంలో పనిచేయడంతో ఆమెకు కూడా సైన్యంలో చేరాలని తన తాతలా దేశానికి సేవ చేయాలని కలలు కన్నారు. ఆ కలను నిజం చేసుకున్నారు. అంతే కాకుండా ఆర్మీలో పనిచేసే అధికారినే ఆమె వివాహం చేసుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: