ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు టీడీపీ కొత్త ఆయుధంగా మారుతోందా..అంటే అవుననే అనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం ఇంచు ముంచి మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మూడేళ్లలో జగన్ పాలనపై మిశ్రమ స్పందన లభిస్తోంది. జగన్ ఏదైనా స్వయంకృపారాధాలతో క్రేజ్ తగ్గి ఉండొచ్చేమో కానీ.. టీడీపీ మాత్రం రాజకీయంగా బలపడినట్టు కనిపించడం లేదు. ఆ పార్టీ కూడా విపక్షంగా తగిన పాత్ర పోషిస్తున్నట్టు కనిపించడం లేదు.


ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీకి వివేకానందరెడ్డి హత్య కేసు ఓ కొత్త ఆయుధంగా కనిపిస్తోంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య 2019 ఎన్నికల ముందు జరిగిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన రోజు నుంచే వైసీపీ అధినేత జగన్ సహా వైసీపీ నేతలంతా ఇది టీడీపీ చేయించిన హత్యే అంటూ ఆరోపించారు. అప్పట్లో జగన్ ఏకంగా సీబీఐ ఎంక్వయిరీ వేయించాలని కూడా డిమాండ్ చేశారు. అంతే కాదు.. నారాసుర రక్త చరిత్ర అంటూ అప్పట్లో జగన్ తన సొంత మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించారు.


కానీ ఇప్పుడు సీబీఐ విచారణలో వెల్లడవుతున్న విషయాలు వైసీపీ ఆరోపణలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. సీబీఐకి అనేక మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇతరుల వైపే వేలు చూపిస్తున్నాయి. ఇంకా కేసు విచారణ దశలోనే ఉంది కాబట్టి అప్పుడే దోషులెవరో తేల్చకపోయినా.. ఈ కేసులో టీడీపీ ప్రమేయంపై మాత్రం ఏమాత్రం ఆధారాలు కూడా కనిపించలేదు.


అందుకే ఇప్పుడు టీడీపీహత్య కేసు విచారణను తన ఆయుధంగా మలచుకుంటోంది. దీనికి తోడు ఏకంగా వివేకా అల్లుడు జగన్‌ ఈ హత్య చేయించి ఉండొచ్చని ఇచ్చిన వాంగ్మూలాన్ని టీడీపీ తన ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది. ఈ మొత్తం హత్యోదంతం.. సీబీఐ సేకరించిన ఆధారాలతో ఏకంగా ఓ ఈ బుక్ విడుదల చేసి.. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని నిర్ణయించింది. మరి ఈ హత్య కేసు టీడీపీకి రాజకీయంగా ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: