
తాజాగా ఆబ్కారీ శాఖ సమీక్షలో అధికారులు సీఎంకు ఈ విషయం వివరించారట. ఏపీ రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని.. కానీ.. అదే సమయంలో ఆదాయం మాత్రం పెరిగిందని అధికారులు సీఎంకు తెలిపారట. అందుకు సాక్ష్యంగా కొన్ని లెక్కలు వివరించి చెప్పారట. అవేంటంటే.. 2018–19 లో 384లక్షల కేసుల మద్యం అమ్మగా... 2021–22లో అది 278 లక్షల కేసులకు తగ్గింపోయిందట. అంటే దాదాపు కోటి కేసులు అమ్మకం తగ్గిందన్నమాట. అయితే.. 2018–19లో మద్యం విక్రయాలపై 20,128 కోట్లు ఆదాయం వస్తే.. 2021–22లో ఆదాయం 25,023 కోట్లకు పెరిగిందట.
అంటే ఏడాదిలో ఏకంగా 5 వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్కువగా వచ్చిందన్నమాట. అలా ఎందుకు జరిగిందంటే.. రేట్లు షాక్ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని సీఎం జగన్ అంటున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అదో విధానంగా ఏపీ సీఎం జగన్ చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో నాటుసారా వినియోగం కూడా కంట్రోల్ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అంటున్నారు.
రాష్ట్రంలో నాటు సారా తయారీ, విక్రయాలు సహా గంజాయి సాగు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వీటి తయారీ సాగుపై ఆధారపడిన కుటుంబాల ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గంజాయి సాగును వదలి ఇతర పంటలు సాగు చేస్తున్న వారికి ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇవ్వాలన్నారు. వారికి రైతు భరోసా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.