బలం బలగం ఉన్నా, రాజకీయంగా ఎదిగే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో ఇబ్బందులకు, మరెన్నో అవమానాలకు గురవుతున్నారు. సినిమా హీరోగానే కాకుండా, ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగానూ పవన్ కు ఏపీ లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గతంలో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో, పవన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేదు.

 అయినా కొద్దో గొప్పో సీట్లు ఆపార్టీకి దక్కాయి. కానీ ఆ తరువాత పరిణామాలు పవన్ కు అసహనం కలిగించడంతో పూర్తిగా ప్రజారాజ్యానికి దూరమై, మళ్లీ రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఆ తర్వాత పరిస్థితులు జనసేన ను స్థాపించి పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోయినా, అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ వచ్చేవారు.

 ఇక 2014 ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా జనసేన ఉంది. టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ప్రకటించారు. ఇదంతా అందరికీ తెలిసిన సంగతి. అయినా అప్పటి నుంచి పవన్ పై టీడీపీ అనుకూల ముద్ర పడిపోయింది. పవన్ చంద్రబాబు కనుసన్నల్లో పని చేసే వ్యక్తి గా ముద్ర వేయించుకున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో ప్రజా సమస్యలు, ప్రజావ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడినా పవన్ పట్టించుకోకుండా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పైన విమర్శలు చేస్తూ, మరింతగా అభాసుపాలు అవుతూ వచ్చారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో బిఎస్పి, సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, కేవలం ఒకే ఒక స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగారు.


 అప్పటికీ, ఇప్పటికీ పవన్ పై టీడీపీ ముద్ర అలా ఉండిపోయింది. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే  విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా పవన్ ఇవేమీ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి ఆయన ఏపీ వైపు కన్నెత్తి చూడడం లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారానే రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీని కారణంగా జనసేన పై పూర్తిగా నమ్మకం ఏర్పడడం లేదు. కానీ జనసైనికులు మాత్రం పవన్ మాదిరిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, నిత్యం ప్రజల్లో ఉంటూ, జనసేన పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా వ్యవహరిస్తున్నారు.


ప్రస్తుతం టీడీపీని నామరూపాల్లేకుండా చేసేందుకు బిజెపి కంకణం కట్టుకోవడంతో, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ లో గందరగోళం నెలకొంది. అయినా బీజేపీ మాదిరిగా టీడీపీపై విమర్శలు చేసే పరిస్థితి లేదు. ఇదే జనసేనకు అవరోధంగా మారుతోంది అనే విషయాన్ని పవన్ గుర్తించారు. బిజెపి మాదిరిగానే అన్ని మొహమాటాలు పక్కనపెట్టి యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండకపోతే, ఎప్పటికీ రాజకీయంగా పైచేయి సాధించలేకపోవచ్చని, అప్పుడు తాను పొలిటికల్ లీడర్ గా ఉన్నా, ఫలితం ఉండదనే అభిప్రాయానికి పవన్ వచ్చారట.

ఇదే కాకుండా తన పుట్టిన రోజును పురస్కరించుకుని, జనసైనికులు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అందిస్తుండడం ప్రజల్లో ఈ విషయంపై చర్చ జరుగుతూ, తన ఇమేజ్ పెరుగుతూ వస్తుండటం వంటి విషయాలు పవన్ లో కదలికను తెచ్చారట.


 అందుకే ఇకపై మరింత యాక్టివ్ గా ఉంటూ, ఏపీ రాజకీయాల్లో పట్టు సాధించాలని  పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే జనసేనకు ఊపు తీసుకొచ్చే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పవన్ సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: