ప్రభుత్వంపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పుడైతే బహిరంగంగా గొడవకు దిగేశారో అప్పటి నుండి మంత్రులు కూడా కమీషనర్ ను అన్నీ వైపుల నుండి కమ్ముకుంటున్నారు. ఒకవైపు కొడాలి నాని, మరోవైపు పేర్నినాని నిమ్మగడ్డను  వాయించేస్తున్నారు. వీళ్ళు చాలరన్నట్లు మరోవైపు బొత్సా సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ కూడా రంగంలోకి దిగేశారు. ఇక అంబటి రాంబాబు లాంటి అనేక  ఎంఎల్ఏలు తమ మాటల దాడులను పెంచేస్తున్నారు. నిజానికి వీళ్ళెవరు కూడా నిమ్మగడ్డపై మాటలతో దాడులకు దిగాల్సిన అవసరం లేదు. కానీ అలా చేస్తున్నారంటే అందుకు కారణం నిమ్మగడ్డనే అని చెప్పుకోవాలి. అనవసరంగా చెత్తను నెత్తినేసుకుంటున్న కారణంగానే ప్రభుత్వంతో ప్రతిరోజు ఘర్షణ వాతావరణం కనబడుతోంది. మొన్నటి మార్చిలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను ప్రభుత్వంతో చర్చించకుండానే ఏకపక్షంగా నిమ్మగడ్డ వాయిదా వేయటంతో మొదలైన వివాదం రోజు రోజుకు పెరుగుతునే ఉంది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిచిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చేసి కోర్టులో కేసులు వేసి అల్లరి చేస్తున్నారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే  ప్రభుత్వాన్ని కోర్టులకు లాగి అల్లరి చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమీషన్ను ప్రభుత్వం గుర్తించటం లేదని గోలచేస్తున్న నిమ్మగడ్డ తాను మాత్రం ప్రభుత్వాన్ని గుర్తించాలని అనుకోవటం లేదు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో మాట్లాడాలని సుప్రింకోర్టు చెప్పినా లెక్క చేయలేదు. ముందు రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టేశారు. తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు జరపబోతున్నట్లు ప్రొసీడింగ్స్ కూడా రిలీజ్ చేసేశారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియ్ కాన్ఫరెన్సు కూడా నిర్వహించాలని అనుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ పై ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. అంటే అంతా నిర్ణయం అయిపోయిన తర్వాత ఇక ప్రభుత్వంతో మాట్లాడేదేముంది ?




ప్రభుత్వంతో గొడవలు పెట్టుకున్న ఏ అధికారి కూడా తన విధులను ప్రశాంతంగా నిర్వర్తించలేరన్న చిన్న విషయాన్ని నిమ్మగడ్డ అర్ధం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే వాతావరణం లేదని చీఫ్ సెక్రటరీ చెబితే దాన్ని తప్పుపట్టారు. వేలాది మంది ఉద్యోగులు కరోనా వైరస్ భారినపడ్డారని ప్రధాన కార్యదర్శి చెప్పారు. మరి కొన్నివేలమంది కరోనా వైరస్ నియంత్రణలో ఉన్న కారణంగా ఇపుడు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని చెబితే అది ఎలక్షన్ కమీషన్ను అవమానించినట్లుగా నిమ్మగడ్డ భావించటమే విచిత్రంగా ఉంది.  మొత్తానికి ప్రభుత్వంతో ఏదో ఓ కారణంతో గొడవలు పెట్టుకోవాలని రెడీ అయిన నిమ్మగడ్డపై మంత్రులు కూడా వరుసగా ఎదురుదాడులు చేస్తున్నారు. మామూలుగా అయితే ఎలక్షన్ కమీషనర్ గురించి ఎవరు ఆలోచించరు. అలాంటిది కమీషన్ ఇంత వివాదాస్పదంగా తయారైందంటే అందుకు థ్యాక్స్ టు నిమ్మగడ్డ అనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: