ఏపీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా ఫలితాలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాయి. పోటా పోటీగా ఉంటుంది అనుకుంటే కూటమి ఏకపక్షంగా విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇక వైసీపీ పని అయిపోయింది. ఇక ఆ పార్టీ భూస్థాపితమే అని పలువురు విమర్శిస్తున్నారు.


అయితే ఈ విమర్శల్లో వాస్తవం ఉందా అనేది ఓ సారి పరిశీలిస్తే.. ఎన్నికల్లో ఓడిపోయినా 11 సీట్లకే పరిమితం అయినా భారీ స్థాయిలో ఓటు బ్యాంకు పొందడంలో వైసీపీ విజయం సాధించింది. కొంచెం అర్థం కావడం లేదు కదా. ఈ ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 39.37 శాతం ఓట్ షేర్ వచ్చింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమికి ఓవరాల్ గా 52.24 శాతం ఓట్లు లభించాయి.


విడివిడిగా చూసుకుంటే టీడీపీకి 45.60 శాతం, బీజేపీకి 2.82 శాతం, జనసేనకి దాదాపు 7 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కూటమికి, వైసీపీకి మధ్య ఓట్లం అంతరం చూసుకుంటే పది శాతం మాత్రమే తేడా కనిపించింది. సీట్ల పరంగా భారీగా తగ్గినా ఓటు బ్యాంకు మాత్రం వైసీపీకి సాలిడ్ గా ఉంది.


అంటే ఏపీలో అధికార మార్పిడిలో భాగం అయింది కేవలం పది శాతం మంది మాత్రమే. గతంలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి దోహద పడింది కూడా ఈ పదిశాతం మంది ఓటర్లే.  ఇందులో ఉద్యోగులు, యువత, మిడిల్ క్లాస్, తటస్థ ఓటర్లు ఉన్నారు.  వీరు ఎటు వైపు మొగ్గు చూపితే వారికి ఏకపక్ష విజయం దక్కుతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.  మరి 2029లో వీరి మనసులు గెలుచుకొని వీరిని నిలుపుకొంటేనే కూటమి మరో సారి అధికారంలోకి వస్తుంది. అలా కాకుండా 164 సీట్లు వచ్చాయి అని విజయ గర్వంతో పరిపాలన సాగిస్తే.. వీరు మళ్లీ మార్పు కోరుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: