కాగా ఇందులో తెలంగాణ నుంచి కూడా ఒక స్థానం ఉంది. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కే.కేశవరారు తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు ఈ సీటును కాంగ్రెస్ ఎవరికీ కేటాయిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ ని తెలంగాణ కోటాలో రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల హిమచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్య సభ ఎన్నికల్లో ఆయన అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన్ను తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపాలని హైకమాండ్ భావిస్తోంది. ఇక తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఎన్నికల జరుగుతున్న వేళ ఎన్డీయే కూటమికి బలం భారీగా పెరగనుంది.
కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాధిత్య సింధియా సహా పలువురు సిట్టింగ్ లు లోక్ సభకు ఎంపిక కావడంతో తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉప ఎన్నికలు నిర్వహించే 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలను అధికార ఎన్డీయే కూటమే గెలుచుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఒక్కటే కాంగ్రెస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, అసోం, బిహార్, హరియాణా లో బీజేపీ కూటమే అధికారంలో ఉంది. ఈ లెక్కన బీజేపీ రాజ్యసభ బలం మరింత పెరగనుంది. ఇది ప్రధాని మోదీకి ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు.