అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధులే ఎక్కువసార్లు విజయం సాధించారు. 1983,1985, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి ఇక్కడ వైసీపీ పాగా వేసింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై వైసీపీ నేత దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 31 వేల పైనే మెజారిటీతో గెలిచారు.

 

స్వతహాగా కాంట్రాక్టర్ అయిన శ్రీధర్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున హిందూపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత పుట్టపర్తి వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తూ, 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి పల్లెని మట్టికరిపించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్...నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ కార్యకర్తలకు సైతం లబ్ది చేకూరేలా చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయని వచ్చే ప్రజలకు అండగా ఉంటూ, అధికారులతో మాట్లాడుతూ పనులు చేయిస్తున్నారు.

 

అలాగే నియోజకవర్గంలో పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటు త్రాగునీటి సమస్యలకు చెక్ పెడుతూ, నియోజకవర్గంలోని 193 చెరువులకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కెనాల్ ద్వారా నీళ్ళిచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు చేస్తూ, కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. కాకపోతే ఏడాదిలో పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు.

 

ఇక ఇక్కడ టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది. సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి పెద్దగా యాక్టివ్‌గా లేరు. వయసు మీద పడటంతో ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పల్లె సైలెంట్‌గా ఉండటంతో పుట్టపర్తి తెలుగు తమ్ముళ్ళు శ్రీధర్ రెడ్డికి జై కొడుతున్నారు. ఇలా టీడీపీ వీక్ అయిపోవడం, వైసీపీ బలపడటంతో భవిష్యత్‌లో శ్రీధర్ రెడ్డికి తిరుగులేనట్లే కనిపిస్తోంది. ఆయన టీడీపీకి మళ్ళీ గెలిచే ఛాన్స్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: