పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గోవిందుడు అందరివాడేలే.ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీలు లీడ్ రోల్స్ లో నటించగా భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్, జయసుధ, రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కధని పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ రచించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేసారు.

సినిమా కథ కాస్త అక్కినేని నాగేశ్వరరావు, మీనాల సీతారామయ్య గారి మనవరాలు కధకు మోడరన్ రీమేక్ లా ఉంటుంది. 2014 అక్టోబరు 1న విడుదలయిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాకి ముందు దగ్గుబాటి వెంకటేష్, చరణ్, ఘట్టమనేని కృష్ణలు ముఖ్యపాత్రలు పోషించనున్నారని అన్నారు. అంతు ముందు చరణ్ తేజ తుఫాన్ సినిమా ఆడియో రిలీజ్ కి వెంకటేష్ రావడం ఈ వార్తకు బలాన్ని చేకూర్చింది. అయితే తరువాత కృష్ణ ఆరోగ్య సమస్యల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. వెంకటేష్ కూడా ఎవో కారణాలతో తప్పుకోగా ఆ పాత్రను శ్రీకాంత్ భర్తీ చేసారు.

ఇక మగధీర తరువాత ఫ్యామిలీ జోనర్లో ఓ సినిమా చేయాలనుకున్న చరణ్ కి ఈ సినిమా చేసే దాకా కుదర లేదు. అయితే ఈ సినిమా దెబ్బకు మళ్ళీ ఆ జోలికి వెళ్ళలేదు అనుకోండి. ఇక నిజానికి సినిమా మొదలైనప్పుడు రామ్ చరణ్ తాత పాత్రలో నటించింది ప్రకాష్ రాజ్ కాదు, తమిళ నటుడు రాజ్ కిరణ్ ఆ రోల్ లో 60% షూటింగ్ పూర్తయిన తరువాత ఆయన స్థానంలోకి ప్రకాష్ రాజ్ ని తీసుకొచ్చారు. ఇలా ఎందుకు జరిగింది అంటే,  ఈ సినిమా షూటింగ్ లో కొన్ని రషెష్ చూసిన చిరంజీవి, ఈ సినిమాలొ హీరో ఎవరు? రామ్ చరణా లేక రాజ్ కిరణా? అని కృష్ణవంశీని ప్రశ్నించారట. రాజ్ కిరణ్ చరణ్ ని బాగా డామినేట్ చేస్తున్నారని, కథలో, పాత్రలో మార్పులు చేయమని కోరారట. దాంతో షూట్ మధ్యలో నిలిపివేసి కథలో, ఆ తాత పాత్రలో మార్పులు చేసి రాజ్ కిరణ్ ని సినిమాలోంచి తప్పించి ప్రకాష్ రాజ్ ని తీసుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: