సీనియర్ హీరోయిన్ లైలా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఎగిరే పావురమా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాతో కుర్రాళ్ల గుడ్డెల్ని కొల్లగొట్టింది ఈ గోవా బ్యూటీ. 1997లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్‌ను కొలబద్ద అని ఆటపట్టిస్తుంటుంది లైలా. ఆ డైలాగ్‌ను మళ్లీ సుమారు 25 ఏళ్ల తరవాత మళ్లీ తన నోటి వెంట పలికించారు లైలా.

సుమారు 16 ఏళ్ల తరవాత ‘సర్దార్’ సినిమా ద్వారా లైలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కూడా ఒక హీరోయిన్. ఈనెల 21న సినిమా విడుదలవుతోంది. అయితే, బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో మాట్లాడేందుకు లైలా వేదికపైకి వెళ్లారు. అయితే, యాంకర్ మంజూష.. లైలాకు మైక్ అందిస్తూ ‘కొలబద్ద’ అన్నారు. వెంటనే లైలాకు తన పాత డైలాగ్ గుర్తుకొచ్చేసింది. ఆ డైలాగ్ చెబుతూ పగలబడి నవ్వారామే. అంతేకాదు.. ఇప్పటికీ తాను శ్రీకాంత్‌ను కొలబద్ద అనే పిలుస్తానని అన్నారు.

ఈ సందర్భంగా లైలా మాట్లాడుతూ.. ‘‘మళ్లీ హైదరాబాద్ రావడం చాలా ఆనందంగా ఉంది. ‘సర్దార్’ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి విదుదలై ఘన విజయం సాధించింది. ఆరోజు నా పుట్టినరోజు. ‘సర్దార్’ కూడా నా పుట్టినరోజు నాడు ఈ దీపావళికి వస్తోంది. కాబట్టి నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. కార్తిసినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై మోశారు. అద్భుతంగా నటించారు. థ్రిల్లర్, రొమాన్స్, స్పై.. ఇలా అన్నీ మేళవించి పీఎస్ మిత్రన్ ఒక అద్భుతమైన సినిమాను రూపొందించారు. అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా తెలుగు ఫ్యామిలీ అంటే నాకు ఎంతో ఇష్టం’’ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: