తారాగణం : కార్తీ, రాశీ ఖన్నా, చంకీ పాండే, లైలా, రజిషా విజయన్, అశ్విన్, నిమ్మి, బాలాజీ శక్తివేల్, ఇళవరసు తదితరులుతమిళ స్టార్ కార్తీ 'పోన్నియిన్ సెల్వన్' తో వార్తల్లో వున్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ వున్న తెలుగు మాట్లాడే కార్తీ దీపావళి కానుకగా 'సర్దార్' తో ద్విపాత్రాభినయం చేస్తూ వచ్చాడు. తమిళనాడులో హిట్ టాక్ తో నడుస్తున్న దీనికి పి ఎస్ మిత్రన్ దర్శకుడు. ఇతను గతంలో తీసిన 'హీరో', 'అభిమన్యుడు' తెలుగులో బాగా ఆడాయి. సామాజిక స్పృహతో సమకాలీన సమస్యల్ని కమర్షియల్ సినిమాల రూపంలో అందిస్తూ తనదంటూ ఒక మార్కెట్ ని ఏర్పర్చుకున్నాడు. ఈసారి కూడా అలాటి ఒక కొత్త సమస్యని 'సర్దార్' తో తెరకెక్కించాడు. ఈ సమస్య ఏమిటి, ఇదెందుకు ఉలిక్కిపడేలా చేస్తుందీ తెలుసుకుందాం...

కథ

ఇన్స్ పెక్టర్ విజయ్ ప్రకాష్ (కార్తీ) కి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ వుంటాడు. ఏ పని చేయాలన్నా ముందు చుట్టూ మీడియా వుందా లేదా చూసుకుంటాడు. అంత కెమెరా ఆరాటంతో వుంటాడు (దేశంలో ఇలా ఎవరున్నారో తెలిసిందే). ఒకరోజు యూనివర్సిటీ నుంచి ముఖ్యమైనఫైలు మాయమయిందనీ, అందులో సైనిక రహస్యాలున్నాయనీ వార్తలు రావడంతో దీని పబ్లిటీని హైజాక్ చేయడం కోసం ముందుకు దూకుతాడు. ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో తన తండ్రి గురించి బయటపడుతుంది. తండ్రి సర్దార్ (కార్తీ ద్విపాత్రాభినయం) ఒక సిండికేట్ ఆపరేషన్లో వున్నాడనీ, అయితే దేశద్రోహిగా ముద్రపడ్డాడనీ తెలిసి తండ్రిని వెతకడం మొదలెడతాడు.

ఇంతకీ తండ్రి ఎక్కడున్నాడు? ఆ ఆపరేషన్ ఏమిటి? అందులో విజయ్ ప్రకాష్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అందులో ఈలా విజయం సాధించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ వాటర్ మాఫియాతో స్పై థ్రిల్లర్ కథ. దేశంలో త్రాగునీరు కార్పొరేట్ వ్యాపారంగా మారింది. ఉచితంగా తాగాల్సిన మంచి నీటిని డబ్బిచ్చి బాటిల్స్ లో కొనుక్కుని తాగుతున్నాం. ఈ బాటిల్ నీరు తాగడం వల్ల వేల మంది బాలలు అనారోగ్యం పాలవుతున్నారు. డబ్బే ప్రధానంగా వ్యాపారం చేసుకుంటున్న కంపెనీలు నీటి నాణ్యతని పట్టించుకోవడం లేదు. నాణ్యత గల నీరు అందించాలంటే వ్యయప్రయాసల కోర్చాలి. అసలు బ్రాండెడ్ నీటి దాకా వెళ్ళనవసరం లేకుండా గల్లీ గల్లీలో వెలుస్తున్న మినరల్ వాటర్ యూనిట్లో కలుషిత నీటిని కూడా తెచ్చుకుని తాగుతున్నాం. ఈ దందాని ప్రభుత్వం అరికట్టడమే లేదు. ఇంకా దేశ వ్యాప్తంగా అన్ని నదుల్నీ అనుసంధానం చేసి, దాంతో నీటి వ్యాపారం జోరుగా చేయాలనుకునే మాఫియాలకి, గూఢచారుల సమస్య జోడించి కథ చేశాడు దర్శకుడు. దేశం కోసం అజ్ఞాతంగా పనిచేసే 'రా' ఏజెంట్స్ (గూఢచారులు) విదేశాల్లో పట్టుపడితే ఇక ఐపుండరు. తమ వాడని ఏ ప్రభుత్వం ఒప్పుకోదు. అక్కడి జైళ్ళల్లో మగ్గాల్సిందే, లేదా ప్రాణాలు కోల్పోవాల్సిందే. కానీ త్రివిధ దళాల్లో పనిచేసే వారికి, పోలీసు శాఖలో వారికీ మాత్రం గుర్తింపూ, పతకాలూ లభిస్తూంటాయి. ఇలా ఒక 'రా' ఏజెంట్ విదేశంలో ఉంటున్న, వాటర్ మాఫియాతో సంబంధాలున్న, ఒక ఉన్నతాధికారిని దేశం కోసం చంపి విదేశంలోనే పట్టుబడితే, అతడ్ని ప్రభుత్వం నిరాకరిస్తే పరిస్థితి ఏమిటనేది ఆలోచనాత్మకంగా చర్చించాడు.

నటనలు - సాంకేతికాలు

యువకుడుగా, వృద్ధుడుగా తండ్రీ కొడుకుల పాత్రల్లో కార్తీ ద్విపాత్రాభినయం సస్పెన్సుతో సాగుతుంది. తండ్రి సర్దార్ గా దేశం కోసం ఆపరేషన్ జరిపి విదేశంలో బందీ అయిన గూఢచారి పాత్రలో ఎక్కువ ఆకట్టుకుంటాడు. అతడి వృద్ధుడి మేకప్ గుర్తు పట్టలేనంతగా వుంది. చాలా ఎమోషనల్ నటనతో, సంఘర్షణతో కట్టి పడేస్తాడు. విదేశంలో పట్టుబడిన సైనికుడి కథతో 'సీతా రామం' చూసిందే. అందులో కంటే బలమైన నేపథ్యం, అర్ధం, వాదం ఈ పాత్రకున్నాయి.

కొడుకుగా ఇన్స్ పెక్టర్ పాత్రలో హై రేంజి యాక్షన్ తో వుంటాడుదిలీప్ సుబ్బరాయన్ సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ గుబులెత్తిస్తుంది. జైలు సీను దగ్గర్నుంచీ మొదలు పెట్టుకుంటే ప్రతీ యాక్షన్ సీనూ ఇంకో లెవెల్లో వుంటుంది. ఇక సాక్షీ ఖన్నాతో రోమాన్సు, సాంగ్స్ వంటి కమర్షియల్ మసాలా మామూలే. రాశీ ఖన్నాది కార్పొరేట్స్ తో పోరాడే హై ప్రొఫైల్ పాత్ర. ఇక చంకీ పాండే బాలీవుడ్ టైపు విలన్ గిరీ స్టయిలిష్ గా వుంటుంది. సామాజిక కార్యకర్తగా లైలా నటించింది. ఇలాటి సినిమాల్లో సామాజిక కార్యకర్త పాత్ర చచ్చి పోవడానికే వుంటుంది కాబట్టి, ఈమె కూడా ఆ ఫార్ములా ప్రకారం చచ్చిపోతుంది.

అయితే సంగీతం, ఛాయాగ్రహణం ఫర్వాలేకున్నా, సెకండాఫ్ నీ, క్లయిమాక్సునీ ఎందుకో సరిగ్గా హేండిల్ చేయలేక పోయాడు దర్శకుడు మిత్రన్. అయినా పక్కా మాస్ సినిమా ఎలిమెంట్స్ తో హిట్టు దాకా తీసికెళ్ళి నిలబెట్టాడు

మరింత సమాచారం తెలుసుకోండి: