జమున.. తెలుగు తెర సత్యభామగా పేరు తెచ్చుకున్న నటి.. పాతికేళ్లు హీరోయిన్ గా వెలుగొందిన నటి.. అయితే ఆమె నటిగా స్టార్ డమ్ అందుకునే సమయంలోనే ఎన్టీయార్, ఏయన్నార్ గార్లతో నాలుగేళ్ళ పాటు సినిమాలే చేయలేదు. ఇప్పటికీ అప్పటి నటీనటులు ఈ విషయాన్ని ఉదహరిస్తూ ఉంటారు. మరి ఆ క్రైసిస్ ను ఆమె ఎలా ఎదుర్కొన్నారో ఆమె మాటల్లోనే విందాం..


జమున : ఆ టైమ్‌లో ముఖ్యంగా నాగేశ్వరరావుగారే నా మీద ఎలిగేషన్స్ పెట్టారు. నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. అలాగే ఏ అమ్మాయికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమైనది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నేను ఆలోచించడమే వాళ్లకు నా మీద కోపానికి కారణమైంది. అలాంటి టైమ్‌లో వేరే అమ్మాయి అయితే బాధతో ఏమైనా చేసుకునేది. కానీ, నేను ధైర్యవంతురాలు అవడంతో అన్నింటినీ ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యా.


అప్పుడు అన్నీ మహిళా ప్రధానమైన సినిమాలే చేశా. నా పక్కన కొత్తవాళ్లను హీరోలుగా పెట్టుకున్నా. నేను చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలన్నీ హిట్ అవడంతో అప్పడు నిర్మాతల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. మనకు పెద్ద హీరోలు లేకున్నా పర్వాలేదు.. హీరోయినే మనకు హీరో అనుకున్నారు. అలా చాలా చిత్రాలు చేసి సక్సెస్ అయ్యాను.


వాళ్లు నన్ను దూరం చేశారని నేను ఏ రోజూ ఫీల్ కాలేదు. చక్రపాణి గారు గుండమ్మకథ కోసం మూడేళ్ల తర్వాత కూడా ఆ వేషం జమునే వేయాలని పట్టుబట్టి రాజీ ప్రయత్నాలు చేశారు. అప్పుడు నేను ఒకటే అడిగాను.. సార్ నేను ఏం తప్పు చేశాను. నాగేశ్వరరావుగారు నాకు ఎన్నో నేర్పించారు. ఎలా నటించాలి?.. గ్లిజరిన్ ఎలా వాడాలి? అలాంటి కొత్త విషయాలు ఎన్నో ఆయన నేర్పించారు.


నన్ను అంతగా ప్రోత్సాహించిన ఆయనే ఇలా చేశారంటే.. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక రామారావుగారు భోళాశంకరుడు. ఆయనకు ఇందులో ప్రమేయం ఏమీ లేదు. ఈయనే హింట్ ఇచ్చారు. అంటే ఒక స్త్రీ క్యారెక్టర్‌ను నిలుపుకోవాలంటే మగవాడు ఎన్ని ఉచ్చులు, ఎన్ని కుయుక్తులు పన్నినా తట్టుకోగల ధైర్యం ఉండాలి... అంటూ తన అనుభవాలు వివరించారు అలనాటి మేటి నటి జమున.


మరింత సమాచారం తెలుసుకోండి: