గత సంవత్సరం కరోనా పరిస్థితులు కారణంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సుమారు 15 వందల కోట్లకు పైగా నష్టపోయిందని ఒక అంచనా ఉంది. ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా కుదురు పడి జనం ధియేటర్లకు వస్తున్నారు అన్న ధైర్యం సంక్రాంతి సినిమాల టైమ్ నుండి ఏర్పడటంతో ఇప్పుడు ఒకేసారి అత్యుత్సాహంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ రెచ్చిపోతోంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఫిబ్రవరి నెల అంతా చిన్న సినిమాల హడావిడి కొనసాగితే ఇక మార్చి నుండి మొదలు కాబోతున్న సమ్మర్ రేస్ లో భారీ - మధ్య తరహా - చిన్న తరహా సినిమాలు సుమారు 30కి పైగా ఒకదాని పై ఒకటి పోటీగా ఒకేవారం రెండేసి మూడేసి సినిమాలు కూడ పోటీగా విడుదల కాబోతున్నాయి. ధియేటర్లకు సంబంధించిన 50% ఆక్యుపెన్సీ నిబంధనలు తొలగించి ఫిబ్రవరి 1 నుండి ధియేటర్లలో ఆక్యుపెన్సీ శాతాన్ని పెంచిన పరిస్థితులలో  ఖచ్చితంగా మార్చి నుండి 100శాతం ఆక్యుపెన్సీ వస్తుంది అన్న అంచనాలతో ఈ అనవసరపు పోటీకి తెర తీస్తున్నారు.


ఇలా ఏవో అద్భుతాలు జరుగుతాయి అన్న అంచనాలతో సమ్మర్ సీజన్ లో పోటీగా సినిమాలు విడుదల చేయడం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఒక అలవాటు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ కాబోతోంది. ఏప్రియల్ లో ‘వకీల్ సాబ్’ ‘టక్ జగదీష్’ ‘లవ్ స్టోరీ’ మేలో ‘ఆచార్య’ ‘కేజీ ఎఫ్ 2’ ‘రాధే శ్యామ్’ లతో పాటు మరెన్నో మీడియం రేంజ్ చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సంవత్సరం సమ్మర్ సినిమాల బిజినెస్ సుమారు 1000 కోట్ల వరకు ఉంటుందని ఒక ప్రాధమిక అంచనా వస్తోంది. అయితే ఈ సమ్మర్ రేస్ సినిమాలలో రెండు కానీ లేదంటే మూడు కానీ హిట్ టాక్ తెచ్చుకుంటే మిగతా సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితితులు వల్ల బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఇలా వరస నష్టాలు వస్తున్నా పట్టించుకోకుండా ఎంతకాలం సినిమాల బిజినెస్ కొనసాగుతుంది అన్న సందేహాలు ఉన్నా ఆ విషయాలు పట్టించుకోకుండా ఇలా ఒకరి సినిమా కలక్షన్స్ కు బ్రేక్ ఇస్తూ ఒక సినిమా పై మరొక సినిమా విడుదల అయ్యే కల్చర్ ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితిగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: