శంకర్‌ - రామ్‌చరణ్‌ - దిల్‌ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా నిరవధికంగా ఆగిపోబోతోంది. ఓ సినిమా మొదలుపెడితే పూర్తయ్యేంతవరకు కూడా ఆ సినిమా మీదే ఉండే శంకర్‌ ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్‌ ఇచ్చి మరో సినిమా చేయబోతున్నారు.శంకర్‌ - కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో మొదలై ఆగిపోయిన 'ఇండియన్‌ 2' సినిమా షూటింగ్‌ను మళ్ళీ తిరిగి ప్రారంభించాలని అనుకున్న విషయం తెలిసిందే. దీని కోసమే రామ్ చరణ్‌ సినిమా ఆపేస్తున్నారట.'ఇండియన్‌ 2' సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభిస్తామని ఆ మధ్య కమల్‌ హాసన్‌ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. 'విక్రమ్‌' సినిమా ప్రచారంలో భాగంగా కమల్‌ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో చరణ్‌ సినిమా అయ్యాక 'ఇండియన్‌ 2' సినిమా స్టార్ట్‌ చేస్తారేమో అనుకున్నారు. అయితే రెండు సినిమాలూ పారలల్‌గా జరుగుతాయని మరో మాట కూడా వినిపించింది. దీంతో హమ్మయ్య అని అనుకున్నారు రామ్ చరణ్‌ అభిమానులు. అయితే ఇప్పుడు 'ఇండియన్‌ 2' సినిమా కోసం చరణ్‌ సినిమా షూటింగ్‌ కొన్ని రోజులు ఆపేస్తారని అంటున్నారు.'ఇండియన్‌ 2' సినిమా మళ్లీ మొదలు అనే విషయం చెప్పింది కాజల్‌ అగర్వాల్.


ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు 13 వ తేదీ నుండి 'ఇండియన్‌ 2' సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తారని, అందులో పాల్గొనడానికి ప్రణాళికలు చేసుకుంటున్నానని ఆమె చెప్పింది. దీంతో రామ్ చరణ్‌ సినిమా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వచ్చింది. అయితే ఆగస్టు 15 వ తేదీన చరణ్‌ లుక్‌ కానీ, టీజర్‌గానీ విడుదల చేస్తారు అని అన్నారు.ఇక ఆ తర్వాత కొత్త షెడ్యూల్‌ ఉంటుంది అని కూడా ఉన్నారు.ఇక తెలుగులో చిత్రీకరణలు ఆగిపోవడంతో ఆ షెడ్యూల్‌ ఉంటుందా లేదా అనేది తెలియడం లేదు. ఆ షెడ్యూల్‌ తర్వాత రామ్ చరణ్‌ లుక్‌లో మార్పులు అవసరమని, రామ్ చరణ్‌ ఆ లుక్‌లోకి మారడానికి పట్టే సమయంలో శంకర్‌ 'ఇండియన్‌ 2' సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తారని కూడా చెబుతున్నారు. అయితే లుక్‌ ఛేంజ్‌కి అన్ని రోజులు పడుతుందా అనేది ఇంకా తెలియాలి. అన్నట్లు ఈ సినిమాకు ఇప్పటికే చాలా టైటిల్స్‌ కూడా వినిపించాయి. ఇంకా తాజాగా 'సీఎం' అనే పేరు వినిపిస్తోంది. అయితే ఈ సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని అర్థమట.

మరింత సమాచారం తెలుసుకోండి: