టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న సినీ కుటుంబాల్లో మంచు వారిది ఒకటి. ఈ కుటుంబ పెద్ద మోహన్ బాబు..  ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటుడిగా, నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు. ఒక నటుడు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏకంగా 550 దాకా సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన భారీ విజయాలను అందుకున్నారు. హీరోగా వైభవం చూస్తూనే విలన్, క్యారెక్టర్ రోల్స్‌తోనూ అదరగొట్టారు.

అలాంటి నటుడికి గత రెండు దశాబ్దాలుగా పెద్దగా కలిసి రావడం లేదు. ఆయన స్థాయికి తగ్గ పాత్రలు, విజయాలు దక్కక బాగా నెమ్మదించారు మోహన్ బాబు. అదే సమయంలో ఆయన నట వారసులు కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న.. ముగ్గురి కెరీర్లకూ బ్రేకులు పడ్డాయి. మళ్లీ పుంజుకోవడానికి ముగ్గురూ కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో మోహన్ బాబు వంద కోట్ల సినిమా ప్రకటన చేయడం విశేషం.

మంచు విష్ణు హీరోగా తాను వంద కోట్ల బడ్జెట్లో ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు మోహన్ బాబు తాజాగా వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ విషయం వెల్లడించారు. ఈ సినిమా మోహన్ బాబు యూనివర్శిటీ, అక్కడి విద్యార్థుల చుట్టూ తిరుగుతుందని మోహన్ బాబు చెప్పడం విశేషం. సినిమా పూర్తి వివరాలు విష్ణు ప్రకటిస్తాడని కూడా ఆయన అన్నారు.

విష్ణు హీరోగా భారీ సినిమా చేయాలని మోహన్ బాబు కొన్నేళ్ల నుంచి అనుకుంటున్నారు. గతంలో తనికెళ్ల భరణి దర్శకత్వంలో విష్ణు హీరోగా భక్త కన్నప్ప చిత్రాన్ని దాదాపు వంద కోట్ల బడ్జెట్లో తీయాలనుకున్నారు. కానీ రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఆ ప్రాజెక్టు అటకెక్కేసింది. ఇప్పుడు విష్ణు మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసిన సమయంలో వంద కోట్ల సినిమా అంటున్నారు మోహన్ బాబు. పైగా యూనివర్శిటీ, స్టూడెంట్స్‌తో ముడిపడ్డ సినిమా అంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: