
రాజమౌళి తీరుపై శ్రీకృష్ణ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి తనను ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన ఆవేదన వెళ్లగక్కారు. ఫాల్కే పై సినిమా తీయాలనుకుంటే, ముందుగా కుటుంబాన్ని సంప్రదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. "ఆయన జీవితానికి సంబంధించిన నిజమైన సమాచారం మా దగ్గరే ఉంది. రాజమౌళి టీమ్ నుంచి ఇప్పటివరకు ఎవరూ మమ్మల్ని కలవలేదు. ఇలాంటి ప్రాజెక్ట్‌లో కుటుంబాన్ని భాగం చేయడం చాలా ముఖ్యం కదా?" అని శ్రీకృష్ణ ప్రశ్నించారు.
గతేడాది (2023)లో రాజమౌళి 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో ఓ బయోపిక్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. సుమారు అదే సమయంలో, బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, సంచలన దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కూడా ఫాల్కే జీవితంపై సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. అయితే, రాజమౌళికి భిన్నంగా అమీర్ ఖాన్ టీమ్ గత మూడేళ్లుగా శ్రీకృష్ణతో టచ్‌లోనే ఉందట.
అమీర్ ఖాన్, ఆయన బృందం నిజాయితీగా చేస్తున్న ప్రయత్నాలను శ్రీకృష్ణ ప్రశంసలతో ముంచెత్తారు. వారి అసిస్టెంట్ ప్రొడ్యూసర్, హిందూకుష్ భరద్వాజ్, తనను చాలాసార్లు కలిసి, ఎంతో డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి మరీ సమాచారం సేకరించారని తెలిపారు. "అమీర్, హిరానీ కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని విని మొదట ఆశ్చర్యపోయాను. కానీ వారి టీమ్ మా పట్ల ఎంతో గౌరవం చూపించింది. వారి పనితీరుతో నాకు ఎలాంటి సమస్య లేదు," అని శ్రీకృష్ణ చెప్పుకొచ్చారు.
అంతేకాదు, తన నాయనమ్మ సరస్వతీబాయి ఫాల్కే పాత్రలో ప్రముఖ నటి విద్యా బాలన్ నటిస్తే అద్భుతంగా ఉంటుందని శ్రీకృష్ణ ఓ ఆసక్తికరమైన సూచన కూడా చేశారు. అమీర్ ఖాన్, హిరానీల ఈ బయోపిక్‌కు ఇంకా అధికారికంగా టైటిల్ ఖరారు కాలేదు. సమాచారం ప్రకారం, అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. జూన్ 20న తన 'సితారే జమీన్ పర్' సినిమా విడుదలయ్యాక, అమీర్ ఖాన్ ఫాల్కే పాత్ర కోసం సన్నద్ధం కానున్నట్లు టాక్.