
తమిళ సినీ పరిశ్రమలో సాయి ధన్షిక గుర్తింపు పొందిన నటి. 1989 నవంబర్ 20న తమిళనాడు రాష్ట్రం తంజావూర్‌లో సాయి ధన్షిక జన్మించింది. ఆమె తండ్రి క్రైస్తవుడు కాగా.. తల్లి హిందువు. సాయి ధన్షికకు ఎటువంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. చిన్నతనం నుంచి నటన, మోడలింగ్ పట్ల ఆసక్తి చూపించింది. కుటుంబం కూడా ప్రోత్సహించడంతో తన ప్రతిభ, కష్టంతో నటిగా ఎదిగింది.
చదువుకుంటున్న రోజుల్లో మోడలింగ్ లోకి ప్రవేశించిన సాయి ధన్షికను కొందరు చిత్ర దర్శకులు గమనించారు. 2006లో `తిరుడి` అనే తమిళ చిత్రంలో అవకాశం కల్పించారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టకపోయినా.. మరిన్ని ఆఫర్లు వచ్చేలా చేసింది. సాయి ధన్షికకు బ్రేక్‌త్రూ వచ్చింది 2009లో విడుదలైన `పేరణ్మై`తోనే. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో సాయి ధన్షిక తల్లి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తమిళంలో వరుసగా సినిమాలు చేసింది.
2016లో `కబాలి` చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురిగా నటించి మరింత ఫేమస్ అయింది. సాయి ధన్షిక తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ పని చేసింది. తెలుగులో `షికారు`, `అంతిమ తీర్పు`, `దక్షిణ` వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. విభిన్న పాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపే సాయి ధన్షిక.. రీసెంట్ టైమ్ లో సైన్స్ ఫిక్షన్ పౌరాణిక థ్రిల్లర్ `ఐందం వేదం` వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసి అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక పెళ్లి తర్వాత కూడా సాయి ధన్షిక తన యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తుందని తాజాగా విశాల్ చెప్పడం విశేషం.