ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలనం సృష్టించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూములను అక్రమంగా ఆక్రమించుకుందన్న ఘోర ఆరోపణలతో పవన్ కల్యాణ్ బాంబు పేల్చేశారు. దాదాపు 76.74 ఎకరాల అటవీభూములు పెద్దిరెడ్డి కుటుంబం అధీనంలో ఉన్నాయన్న సాక్ష్యాలతో పవన్ ప్రజల ముందుకు వచ్చారు. అంతేకాదు, ఆ భూముల్లో నిర్మించిన గెస్ట్ హౌస్, దారులు, నరికిన చెట్లు, మరియు చుట్టుపక్కల వనప్రాంతం ధ్వంసమవుతున్న దృశ్యాలను స్వయంగా చిత్రీకరించి వీడియోగా విడుదల చేశారు.


పవన్ కల్యాణ్ ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించినప్పుడు హెలికాప్టర్ లో ప్రయాణిస్తూనే ఈ వీడియోను తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. అనంతరం ఎక్స్ (Twitter) వేదికగా ఆ వీడియోను పోస్టు చేస్తూ, “ఇది ప్రజల భూమి... భవిష్యత్ తరాల ఆస్తి. దానిని వ్యక్తిగత రాజ్యంగా మార్చే హక్కు ఎవరికీ లేదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన ఆరోపణల ప్రకారం, పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమించి, గెస్ట్ హౌస్ నిర్మించడంతోపాటు, ప్రైవేట్ రోడ్ ఏర్పాటుచేసుకుని, చెట్లను నరికివేసి చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు.



ఈ వీడియో బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ కీలక నాయకుడు అయిన పెద్దిరెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడం చిన్న విషయం కాదు. గతంలో అటవీ శాఖ కేసులు నమోదు చేసినా, అవి ఎక్కడో ఫైళ్లలోనే ఆగిపోయాయి. అయితే పవన్ కల్యాణ్ నేరుగా సాక్ష్యాలతో వీడియో విడుదల చేయడంతో ఇప్పుడు ఆ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ ఈసారి కేవలం ఆరోపణలతో ఆగిపోకుండా, “ఆక్రమణదారులెవరైనా వదిలిపెట్టరాదు” అని అటవీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.



 “అటవీ భూములు కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు, అవి ప్రజల ఊపిరి, భవిష్యత్ తరాల జీవనాధారం” అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రజల్లో ఆయన ధైర్యాన్ని ప్రశంసించే స్వరాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ వర్గం మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపిత చర్యగా ఖండిస్తోంది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఈ చర్యతో వైసీపీపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎంత త్వరగా స్పందిస్తుందన్నదే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: