సావిత్రి — ఈ పేరు కేవలం ఒక నటి గుర్తింపుకే పరిమితం కాదు. ఇది ఒక వరప్రసాదం, ఒక ప్రఖ్యాతి చిహ్నం, భారతీయ సినీ రంగానికి చిరస్థాయిగా నిలిచిన ఓ బ్రాండ్. ఒక హీరోయిన్ ఎలా ఉండాలి? నటనలోని నిగూఢత నుండి వ్యక్తిత్వంలోని వినమ్రత వరకు ఎలాంటి ప్రమాణాలు ఉండాలి? అనే ప్రతి ప్రశ్నకు సావిత్రి అనే పేరే సమాధానం. ఆమె కట్టుబొట్టు, ఆమె మాట తీరు, ఆమె స్క్రీన్‌ ప్రెజెన్స్, అలాగే ఆమె అద్భుతమైన వాక్చాతుర్యం. ఆమెను ఒక ‘పర్ఫెక్ట్ ఐకాన్’గా నిలబెట్టాయి.


1937 డిసెంబర్‌ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సావిత్రి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నిశ్శంకర సుభద్రమ్మ, గురవయ్య. వారికి పుట్టిన చిన్నారి సరసవాణి దేవి—అదే భవిష్యత్తులో ప్రపంచం మహానటి సావిత్రిగా పిలిచిన పేరు. సావిత్రికి మారుతి అనే అక్క ఉండేది. చిన్నతనంలోనే ఆ కుటుంబం ఘోర విషాదాన్ని ఎదుర్కొంది. సావిత్రి పుట్టిన ఆరు నెలలు కూడా గడవక ముందే ఆమె తండ్రి టైఫాయిడ్‌తో కన్నుమూశారు. తల్లిని, ఇద్దరు చిన్నారులను ఈ పరిస్థితుల్లో నిలబెట్టడం ఒక పెద్ద సవాలు. అప్పుడు ముందుకు వచ్చిన వారు ఆమె పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య, పెదతల్లి దుర్గాంబ. వారు తమ సొంత పిల్లలలా సావిత్రి, మారుతిని అండగా నిలబెట్టి పెంచారు.ఈ ప్రేమతో, ఆప్యాయతతో పెరిగిన సావిత్రి చిన్నప్పటి నుంచే కళల్లో మునిగి ఉండేది. నృత్యం, నాటకం, నటన—ఏది ఇచ్చినా ఆమె ఒంటి సొంతం చేసుకునే సహజ ప్రతిభ ఆమెలో ఉండేది. కటిక పేదరికం నీడలో పెరిగినా, ఆ పరిస్థితులు ఏనాడూ ఆమె కలలను అడ్డుకోలేకపోయాయి. మనసులో ఉన్న జ్వాల, కళపై ఉన్న ప్యాషన్ ఆమెను ముందు నడిపించాయి.



సినిమాల్లో అడుగుపెట్టిన క్షణం నుంచి సావిత్రి వెలుగుల జాతకమే మొదలైంది. ఆ కాలంలోనే ఆమె స్టార్ అయ్యింది. ‘లేడీ సూపర్‌ స్టార్’ అనే పదాన్ని తెలుగు సినిమాకి పరిచయం చేసిన తొలి వ్యక్తి ఆమెనే అని చెప్పుకోవచ్చు. ఆమె నటనలోని సహజత్వం, స్క్రీన్‌పై కళ్లలో కనిపించే భావోద్వేగం, పాత్రలను శరీరమంతా అనుభూతి చెందుతూ నటించే తీరు—ఇవి అన్నీ దర్శకులను, సహనటులను, ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసేవి.ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ వంటి ఆ కాలపు మహాగణాలతో కలిసి నటిస్తూ కూడా, వారిని స్క్రీన్‌పై డామినేట్ చేసిన ఏకైక హీరోయిన్‌గా నిలిచిన ఘనత సావిత్రిదే. ఒక ఫ్రేమ్‌లో ఆమె ఉన్నా… మన దృష్టి ముందుగా పడేది ఆమె ముఖంపై, ఆమె కళ్లలో మెరుస్తున్న భావంపై.

మరింత సమాచారం తెలుసుకోండి: