వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ నిర్మించిన క్రేజీ ప్రాజెక్ట్ “స్కై” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పేరిచెర్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్కై మూవీ ద్వారా  పృధ్వీ పేరిచెర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేవలం దర్శకత్వమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు పాటలకు సాహిత్యం కూడా ఆయనే అందించడం విశేషం. మురళీ కృష్ణంరాజు కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతుండగా, శృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. శివ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా, రిలీజ్‌కు ముందే సాంగ్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

సింగర్ గా సక్సెస్ అవ్వాలనే లక్ష్యంతో తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభు, ఆ క్రమంలో భార్యను కోల్పోవడమే కాకుండా పదేళ్ల కొడుకును హాస్టల్ లో చేర్చి ఒంటరిని చేస్తాడు. తండ్రి ప్రేమకు దూరమై, ఆ ఒంటరితనాన్ని భరించలేక కొడుకు ఆత్మహత్యాయత్నం చేయడంతో ప్రభు జీవితం తీవ్ర విషాదంలో మునిగిపోతుంది. చివరికి తను అనుకున్నది సాధించలేక, రెస్టారెంట్లలో లైవ్ సింగర్‌గా మారుతాడు. ఆ సమయంలోనే ఆది మ్యూజిక్ బ్యాండ్‌తో పరిచయం ఏర్పడి, పాటల ద్వారా తన బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతుకుతున్న విక్కీకి తన చిన్ననాటి స్నేహితుడు జాఫర్ తోడవుతాడు.

వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ నడుపుతూ ఫుడ్ డెలివరీ చేస్తుండగా, విక్కీకి వీణ పరిచయం అవుతుంది. గతంలో జాఫర్ తనను మోసం చేయడంతో మొదట విక్కీని అనుమానించిన వీణ, ఆ తర్వాత అతడిలోని నిజాయితీని చూసి ప్రేమలో పడుతుంది. అయితే చిన్నప్పటి నుంచి ఒంటరితనంలోనే పెరిగిన విక్కీ, సడన్‌గా తన జీవితంలోకి వచ్చిన వీణ ప్రేమను అంగీకరించలేకపోతాడు. అసలు విక్కీ గతం ఏమిటి, అతడు వీణ ప్రేమను ఎందుకు నిరాకరించాడు, కొడుకు జ్ఞాపకాలతో కుమిలిపోతున్న ప్రభుకి చివరికి ఎవరి ద్వారా ఓదార్పు లభించింది అనే అంశాలతో ఈ కథ ఉత్కంఠభరితంగా సాగి సుఖాంతం అవుతుంది.

విశ్లేషణ :

నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనుషులు ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని, ఆ సమయంలో కలిగే భావోద్వేగాలను దర్శకుడు పృధ్వీ పేరిచెర్ల 'స్కై' మూవీలో తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఏళ్ల తరబడి ఒంటరిగా గడుపుతున్న ప్రభు, విక్కీ, వీణ అనే ముగ్గురు వ్యక్తులు తమ జీవితాల్లో ఏం కోల్పోయారు? ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి వారు సాధించింది ఏమిటి? అసలు ఒంటరితనం వారికి నేర్పిన పాఠాలేమిటి? అనే అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది.

విక్కీ, వీణ,  ఆనంద్ పోషించిన ప్రభు పాత్రలను దర్శకుడు ప్రథమార్థంలో పరిచయం చేసిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఫస్టాఫ్ అంతా వినోదాత్మకంగా సాగుతూనే, హీరోయిన్‌కు హీరోపై ప్రేమ ఎలా పుట్టిందనే విషయాన్ని ఇంటర్వెల్ సీన్‌లో ఎంతో సెన్సిబుల్‌గా చూపించారు. హీరో హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఈ మూడు పాత్రలను సమాంతరంగా నడిపిస్తూ దర్శకుడు పృధ్వీ కథను హృద్యంగా తెరకెక్కించారు. కథలో వినోదానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

ఇక ద్వితీయార్థం విషయానికొస్తే, కథ, కథనం, మాటలు అన్నీ దర్శకుడే స్వయంగా రాయడం వల్ల సినిమాపై ఆయన పట్టు ఎక్కడా సడలలేదు. ఈ ఎమోషనల్ డ్రామాలో పాత్రల స్వభావాన్ని, వారి నేపథ్యాన్ని చాలా వివరంగా చూపించడంలో పృధ్వీ విజయం సాధించారు. ప్రథమార్థంలో పరిచయమైన పాత్రలన్నీ చివరి వరకు కథను నడిపించడంలో కీలకంగా మారడంతో సెకండాఫ్ ఎంతో ఎంగేజింగ్‌గా సాగుతుంది. నటీనటులందరూ తమ నటనతో మెప్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు సెకండాఫే ప్రాణం. ఎక్కడా విసుగు పుట్టించకుండా సాగే ఈ కథలో క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటుంది.

మురళీ కృష్ణంరాజు తన మొదటి సినిమాలోనే విక్కీ పాత్రలో కామెడీ, రొమాంటిక్ సీన్స్‌ను చక్కగా పండించి హీరోగా పర్వాలేదనిపించారు. అయితే సెకండాఫ్ లోని ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది. శృతి శెట్టి వీణ పాత్రలో ఒదిగిపోయి తన నటనతో ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు ఆనంద్, ప్రభు అనే పూర్తి స్థాయి పాత్రలో జీవించారు. రాకేశ్ మాస్టర్, మణిబామ్మ ఒకే సీన్‌లో కనిపించినా ఆ సన్నివేశం బాగా వర్కవుట్ అయ్యింది. మిగతా నూతన నటీనటులందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు పృధ్వీ ప్రతిభకు రసూల్ ఎల్లోర్ అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ తోడై సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ రిచ్‌గా తెరకెక్కించడంలో వారు సక్సెస్ అయ్యారు, ముఖ్యంగా ప్రారంభంలో హైదరాబాద్ సిటీ ఏరియల్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. సీనియర్ ఎడిటర్ సురేష్ ఆర్స్ కూర్పు సినిమా వేగాన్ని పెంచింది. శివప్రసాద్ అందించిన పాటలు సందర్భానుసారంగా ఉంటూ వినసొంపుగా ఉన్నాయి, దీనివల్ల కథ ఎక్కడా బోర్ కొట్టకుండా క్లైమాక్స్ వరకు చాలా ఆసక్తికరంగా సాగింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ, ఎక్కడా రాజీ పడకుండా ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించిన నిర్మాతలను అభినందించాల్సిందే.

రేటింగ్ : 2.75/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: