టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టని మృణాల్, ఈసారి మాత్రం తన గత ప్రేమ జీవితం గురించి కొంత మనసు విప్పి మాట్లాడింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించిన సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆమె స్పష్టంగా వివరించింది.మృణాల్ మాట్లాడుతూ, తాను హృతిక్ రోషన్‌తో కలిసి ‘సూపర్ 30’ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తెలిపింది. ఆ సమయంలో తన జీవితంలో వృత్తి పరంగా ఎంతో ముఖ్యమైన దశ నడుస్తుండగా, వ్యక్తిగతంగా కూడా ఒక సంబంధంలో ఉన్నానని ఆమె చెప్పింది. అయితే హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరో సరసన తాను నటించడం తన ప్రియుడిపై ఊహించని ప్రభావం చూపిందని వెల్లడించింది. హృతిక్‌ను చాలా మంది అభిమానులు “గ్రీక్ గాడ్” అని సంభోదిస్తుంటారు. అలాంటి వ్యక్తితో తాను తెరపై కనిపించడం చూసి అతనిలో తీవ్రమైన అస్థిరత మొదలైందని మృణాల్ తెలిపింది.

“తను ఒక స్టార్ హీరో సరసన నటిస్తోంది… నేను ఎక్కడ వెనుకబడిపోతానో?” అనే భావన అతనిలో బలంగా ముదిరిపోయిందని ఆమె పేర్కొంది. ఆ ఆలోచన అతనిని మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేసిందని తెలిపింది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో, మృణాల్ ప్రియుడు జిమ్‌లో కఠినంగా శ్రమించడం ప్రారంభించాడని ఆమె వివరించింది. కేవలం కొద్ది కాలంలోనే దాదాపు 20 కిలోల బరువు తగ్గేంతగా అతను శారీరక శ్రమ చేశాడని చెప్పింది. అయితే ఆ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఫిట్‌నెస్‌పై ఆసక్తి కాదని, తనను ఇతరులతో పోల్చుకోవడం వల్ల వచ్చిన ఒత్తిడేనని మృణాల్ చెప్పింది.అయితే ఈ మార్పు ఎక్కువ కాలం నిలబడలేదని ఆమె తెలిపింది. కొంతకాలానికే అతను మళ్లీ బరువు పెరగడం చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పింది. “ఇలా ఎందుకు చేస్తున్నావు?” అని అడిగినప్పుడు అతను ఇచ్చిన సమాధానం తనను ఎంతగానో కలచివేసిందని మృణాల్ వెల్లడించింది. “నీ చుట్టూ ఉన్న సినీ స్టార్లతో నేను పోటీ పడాలని అనుకున్నాను. వాళ్లలా మారాలని ప్రయత్నించాను. కానీ అది నా వల్ల కాలేదు. అందుకే జిమ్‌ మానేశాను” అని అతను నిరాశగా చెప్పాడని ఆమె తెలిపింది.

అందం, ఫిట్‌నెస్ వంటి విషయాల్లో ఇతరులతో పోల్చుకోవడం ఎంతటి మానసిక వేదనకు దారితీస్తుందో తాను తన కళ్లారా చూశానని మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో ఉన్న సంబంధంలో తాను ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో ఉన్నప్పటికీ, అతను తనను తాను ఇతరులతో పోల్చుకోవడం ఆ బంధాన్ని దెబ్బతీసిందని చెప్పింది. వ్యక్తిగత అస్థిరతలు, తక్కువతనం భావనలు ఒక బంధాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని ఆమె సూచించింది. ఈ అనుభవం తనకు జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని మృణాల్ చెప్పింది. సంబంధం అనేది పరస్పర విశ్వాసం, ఆత్మవిశ్వాసం, పరస్పర గౌరవం మీద ఆధారపడాలని ఆమె అభిప్రాయపడింది. ఒకరు ఎదుగుతున్నప్పుడు మరొకరు ప్రోత్సహించాలి గానీ, పోలికలతో బాధపడకూడదని ఆమె సూచించింది. ఇతరులతో పోల్చుకోవడం కన్నా, మనలోని ప్రత్యేకతను గుర్తించి దానిని మెరుగుపరచుకోవడం ముఖ్యం అని చెప్పింది.




మరింత సమాచారం తెలుసుకోండి: