తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య వివాదం ముదరుతోంది. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని  ఎమ్మెల్యే రాజా సింగ్‌కు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. రాజాసింగ్ ఎప్పుడు వస్తానంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని చెప్పారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? అని రాజా సింగ్ ను ప్రశ్నించారు చక్రపాణి రెడ్డి. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని ఏపీలో బలోపేతం కావాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.  

               శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు శిల్పా చక్రపాణి రెడ్డి. సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారన్నారు. నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న రజాక్ అనే వ్యక్తి ..  తొమ్మిది సంవత్సరాల నుంచే రాజకీయాల్లో ఉన్న  తనకు బినామీ ఎలా అవుతాడన్నారు చక్రపాణి రెడ్డి. తనపై అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదన్నారు. తన హిందుత్వం గురించి మఠాధిపతులను, పీఠాధిపతులను అడిగితే తెలుస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే. ఎన్నో దేవాలయాలకు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి తనను పట్టుకొని హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

              శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి ఓ టీమ్ తయారుచేసి, రజాక్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని రాజా సింగ్ ఆరోపించారు. శ్రీశైలం చుట్టుపక్కల ముస్లింలకు ఎక్కువ శాతం షాపులు ఇచ్చారన్నారు. గతంలో శ్రీశైలానికి వెళ్లినప్పుడు చాలా మంది ఫిర్యాదులు చేశారని, గొడ్డు మాంసం, మద్యం, మత్తుపానీయాలు వినియోగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడాలని, ఎమ్మెల్యే చక్రపాణిని కట్టడి చేయాలని ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అన్యమతస్థులకు ఇవ్వకూడదన్న విషయం దేవాదాయ చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని, తాము ఇన్వాల్వ్ అయితే వేరేలా ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: