అడిలైడ్ వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై ఆస్ట్రేలియా విజయభేరీ మోగించింది. దీంతో ఈనెల 26వ తేదీన సిడ్నీ వేదికగా జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

శుక్రవారం అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈనెల 26వ తేదీ భారత్‌తో సెమీ ఫైనల్‌లో తలపడే జట్టును నిర్ధారించనున్న ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్లు రాణించలేదు. ఫలితంగా 49.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు పదునైన బంతులతో విరుచుకుపడ్డారు. దీంతో పాక్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. ఐదు, ఆరో ఓవర్లలో వరుసగా పాక్ ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ సర్ఫరాజ్ అహ్మద్ (10) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెనువెంటనే అహ్మద్ సెహజాద్ (5) కూడా జోస్ హ్యాజిల్ వుడ్ బౌలింగ్‌లో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హరీస్ సొహైల్ 41, మిస్బా ఉల్ హక్ 34, ఉమర్ అక్మల్ 20, మక్సూద్ 29, షాహిద్ ఆఫ్రిది 23, వాహబ్ రియాజ్ 16, ఎసాన్ అదిల్ 15, సోహైల్ ఖాన్ 4, రాహాత్ అలీ 6 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 10 రన్స్ వచ్చాయి. దీంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజ్లీవుడ్ 4, స్ట్రాక్ 2, మాక్స్‌వెల్ 2, జాన్సన్, ఫ్లుంక్నర్లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ చేధించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ స్మిత్ 69 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా, వాట్సన్ 66 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 (నాటౌట్), మాక్స్‌వెల్ 29 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 44 (నాటౌట్) చేశారు.

ఓపెనర్లు... డేవిడ్ వార్నర్ 24, ఫించ్ 2, క్లార్క్ 8 చొప్పున పరుగులు చేశారు. దీంతో 33.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్లు కీలకమైన రెండు క్యాచ్‌లను వదిలివేశారు. అర్థసెంచరీతో దుమ్మురేపిన షేన్ వాట్సన్‌ నాలుగు పరుగుల వద్ద, మ్యాక్స్‌వెల్‌ ఐదు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేసి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ 2, ఖాన్, అదిల్‌లు ఒక్కోట వికెట్ చొప్పున తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: