పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని సోమవారం రైతులు అడ్డుకున్నారు. పోలవరం కుడికాలువ 1.5 కిలోమీటరు వద్ద కాంట్రాక్టరు చేపట్టిన మట్టి తవ్వకం పనుల్ని నిలిపేశారు. పరిహారం చెల్లించకుండా తమ భూముల్లో పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ చెప్పిన మేరకు ఎకరానికి రూ.19.53 లక్షల నష్టపరిహారం, రూ.20 వేల పంటనష్టం చెల్లించాకే పనులు చేపట్టాలని తాము అప్పుడే చెప్పామని, దీనికి అధికారులు కూడా అంగీకరించారని తెలిపారు.

ఇప్పుడు పరిహారం చెల్లించకుండానే పనులు ఎందుకు చేపట్టారని నిలదీశారు. తన చేలో మట్టి పోస్తున్న విషయమై వీఆర్‌వో డి.గణపతిరావును అడగ్గా మట్టి నమూనా సేకరణ కోసమని చెప్పారని, కానీ వాస్తవం అదికాదని రైతు పంతులు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పనుల్ని అడ్డుకున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎం.ముక్కంటి అక్కడకు చేరుకుని వారితో చర్చలు జరిపారు.

రైతుల భూములకు పూర్తిగా పరిహారం చెల్లించేందుకు మండల మేజిస్ట్రేట్‌గా తాను లేఖ ద్వారా హామీ ఇస్తానని, 60 రోజుల తరువాత పూర్తిగా పరిహారం చెల్లిస్తామని తహశీల్దార్ చెప్పారు. ఆ మేరకు ఆయన ఇవ్వబోయిన లేఖను తీసుకునేందుకు రైతులు నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోను నష్టపరిహారం చెల్లించాకే భూముల్లో పనులు చేసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు తైలం శ్రీరామచంద్రమూర్తి, కేదాసు మోహన్‌రావు, ఎదురేసి లక్ష్మి, తోరం సాయి, సిగ్ధన అరవాలరాజు, బండి కృష్ణ, గోపల వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: