మాజీ సీఎం చంద్రబాబు విదేశాలకు పారిపోబోతున్నారా.. ఆయన ఎన్నికల బహిష్కరణ నిర్ణయం వెనుక ఉన్న అసలు విషయం ఇదేనా.. తన రాజకీయ చరిత్ర ముగిసిందని ఆయన అర్థం చేసుకున్నారా.. త్వరలోనే ఆయన టీడీపీని బీజేపీలోకి విలీనం చేస్తారా.. తనపై ఎలాంటి కేసులు లేకుండా ఒప్పందం చేసుకుని విదేశాలకు పారిపోబోతున్నారా.. ఇది వింటుంటే మరీ ఓవర్ గా ఉన్నట్టు అనిపించడం లేదూ..

అనిపిస్తున్నా సరే.. ఇదే నిజం అంటున్నారు.. వైసీపీలోని కొందరు నేతలు. ఏదో చోటా మోటా లీడర్లు కాదు.. ఏకంగా మంత్రులు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని, టీడీపీని బీజేపీలో విలీనం చేసి విదేశాలకు పారిపోతాడేమోనన్న అనుమానం కలుగుతుందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. కర్నూలులో మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాల ప్రతిపక్షంలో కూర్చోలేక చేతులు ఎత్తేసి శిఖండి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని, చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉంటే ఇంట్లో రెస్ట్‌ తీసుకోవాలని, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా బాబు పనికిరాడన్నారు.

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అఖండ విజయాన్ని సాధించిందన్న మంత్రి జయరాం... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని భావిస్తున్నామన్నారు.  అయితే చంద్రబాబు పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తర్వాత ఎక్కువగా వైసీపీ నేతల నుంచి ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.

చంద్రబాబు మాత్రం.. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ తీరుపై నమ్మకం లేదని.. ఎన్నికల కమిషనర్ ఒక రబ్బర్ స్టాంప్ అని అందుకే ఎన్నికలు బహిష్కరిస్తున్నామని అంటున్నారు. నీలం సాహ్నీ  ఎన్నికల నిర్వహణపై నమ్మకం లేదని, ఆమె రబ్బర్ స్టాంప్ కమిషనర్ అని.. అందువల్ల తాము ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని.. ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని అందుకే ఎన్నికలు బహిష్కరించామని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: