2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం బీజేపీ అధినాయ‌కత్వం ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డంతో.. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకి పార్ల‌మెంట్ స్థానాలు త‌గ్గే అవ‌కాశాలున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల‌పై ప్ర‌ధాని మోడీ ఫోక‌స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. చాలా కాలం త‌రువాత ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌కకు చెందిన ఎంపీలతో పాటు మూడు రాష్ట్రాల‌ బీజేపీ నేతలతో అల్పాహార విందు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.


 క‌ర్ణాట‌క‌లో  అధికారంలో ఉండటంతో ఏపీ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో తాజాగా కెసిఆర్ నేరుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఇక ఆ విష‌యంపై ప్రధాని ఏ రకంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలపైన ఈ సభ ద్వారా తాము గట్టిగా పోరాటానికి సిద్ధం అనే సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర ప్రముఖుల‌ను ఆహ్వానించాలని దాని పైన చర్చ సాగింది.


 కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ని పిలవాలని భావించారు. అయితే, యోగి ఉత్తరప్రదేశ్ ఎన్నికల సన్నాహాల్లో బిజీగా ఉండటంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఫ‌డ్న‌విస్‌ను పిలవాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ తెలంగాణ నేతలు ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోం మంత్రి తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరి, బియ్యం అంశాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని చేస్తున్న విమర్శలు.. అదే సమయంలో కెసిఆర్ రాజకీయంగా ఇతర పార్టీల నేతలతో సమావేశాలు పైన చర్చించినట్లుగా తెలుస్తోంది.


 కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలతో తమ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం అవుతారని ఇప్పటికే టిఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు గంట సేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతున్న వేళ‌ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో పవన్కళ్యాణ్ అన్ని పార్టీలు పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే, కేంద్రానికి అవ‌స‌రం అయిన‌ప్పుడ‌ల్లా వాళ్ల‌కు వైసీపీ మ‌ద్ధ‌తు ఇస్తోంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ల‌క్ష్యంగా బీజేపీ రాజ‌కీయ పోరాటానికి సిద్ధం అవుతున్న వేళ ఏపీ రాజ‌కీయాలు కొత్త మలుపుతు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్త‌న్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: