చెట్టు పేరుచెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామందుంటారు. అలాంటివారిలో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఒకరు. బీజేపీ పార్టీకి తన మద్దతుదారులతో కలిసి కన్నా రాజీనామా చేశారు. రాజీనామా చేస్తారని ఎప్పటినుండో అందరు అనుకుంటున్నదే. కాబట్టి అదేమంత పెద్ద విషయంలాగ అనిపించలేదు. నిజానికి కన్నా గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవటంలేదనే చెప్పాలి. ఎందుకంటే కన్నా వైభవం అంతా కాంగ్రెస్ పార్టీతోనే పోయింది.





చాలామంది నేతలకు తామున్న పార్టీ కారణంగానే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆ పార్టీని కాదన్నా లేదా పార్టీ కనుమరుగు అయిపోయినా సదరు నేతలను ఎవరు పట్టించుకోరంతే. ఇపుడు కన్నా పరిస్ధితి కూడా అచ్చంగా అలాగే తయారైంది. కాంగ్రెస్ లో ఉన్నపుడు గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నుండి నాలుగుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుండే కన్నా భవిష్యత్తు కూడా ఊగిసలాడుతోంది.





పార్టీ సంగతి వదిలేస్తే కాపుల్లో కూడా కన్నాకు పెద్దగా పలుకుబడేమీ లేదనే చెప్పాలి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ నుండి బీజేపీ అధ్యక్షుడి హోదాలో అభ్యర్ధిగా పోటీచేశారు. ఎన్ని ఓట్లొచ్చాయంటే 15,468 ఓట్లు. 14,40,732 ఓట్లు పోలైతే కన్నాకు వచ్చింది 15 వేలు. అంటే కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఇది ఘనత వహించిన కన్నాకున్న సీన్. ఇపుడు కన్నా టీడీపీ లేకపోతే జనసేనలో చేరుతారు. చేరితే ఏమవుతుంది ?





టీడీపీలో చేరితే ఆ పార్టీ ఓట్లు కన్నాకు పడాలే కానీ కన్నా వల్ల టీడీపీకి పడే ఓట్లు దాదాపు లేవనే చెప్పాలి. విచిత్రం ఏమిటంటే నరసరావుపేట లోక్ సభలో జనసేన  అభ్యర్ధిగా పోటీచేసిన నయూబ్ కమల్ షేక్ కు 51 వేల ఓట్లొచ్చాయి. రేపటి ఎన్నికల్లో అయినా కన్నా పరిస్ధితి దాదాపు ఇలాగే ఉంటుంది. కాబట్టి కన్నా బీజేపీలో ఉన్నా ఒకటే ఇంకేదైనా పార్టీలో చేరినా ఒకటే. ఇంతోటిదానికి కన్నా విషయంలో మీడియా ఇంత హైప్ ఎందుకు ఇస్తోందో అర్ధం కావటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: