ఊహించనిది జరగడమే రాజకీయమంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఓ జోకర్ గా దిగన డోనాల్డ్ ట్రంప్ చివరకు.. రిపబ్లికన్ల తరపున ఫైనల్ అభ్యర్థిగా ఖరారవుతున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలోకి దిగేది డోనాల్డ్ ట్రంపే అని తేలిపోయింది. ఇండియానా ప్రాథమిక ఎన్నికల్లో విజేతగా నిలిచిన ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసుకున్నాడు. 

ట్రంప్ ప్రత్యర్థి టెడ్‌ క్రూజ్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో ట్రంప్‌కు ఎదురేలేకుండా పోయింది. ఇండియానా ఎన్నికల్లో ట్రంప్‌కు 52 శాతం ఓట్లు వచ్చాయి. టెడ్‌ క్రూజ్‌కు కేవలం 36 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో తనకు ఓటమి తప్పదని తెలుసుకున్న క్రుజ్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి ట్రంప్ కు లైన్ క్లియర్ చేశాడు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలంటే 1237 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. ఇప్పటికే 1047 మంది ట్రంప్‌ పక్షాన నిలిచారు. 

జోకర్ గా వచ్చి.. సూపర్ గా నిలిచి.. 


సమీప ప్రత్యర్థి టెడ్‌ క్రూజ్‌ పోటీ నుంచి వైదొలగడం ట్రంప్‌కు మార్గం మరింత సుగమమైంది. ట్రంప్‌కు ఇంకా 190 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. జూన్‌లో జరిగే ప్రాథమిక ఎన్నికల్లో ఆ మైలురాయికి చేరువకావడం చాలా ఈజీ. ప్రస్తుతం ట్రంప్‌కు పోటీనిస్తున్న ఓహియో గవర్నర్‌ కాసిచ్‌కు కేవలం 153 మంది ప్రతినిధుల మద్దతే ఉంది. కాసిచ్‌ గెలవడం అసాధ్యం. 

ఈ సమీకరణాల కారణంగా రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ట్రంప్‌ పేరును ప్రకటించడం ఖాయం. ఇండియానా ప్రాథమిక ఎన్నికల్లో విజయం తర్వాత ఊహించదగిన అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ పేరును రిపబ్లికన్‌ జాతీయ కమిటీ అధ్యక్షుడు ప్రీబస్‌ ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి రిపబ్లికన్‌ పార్టీ అంతా ఏకంకావాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: