గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతం ఇప్పటివరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల ప్రాంతంగా ఉంది. రాజధానిగా తమ ప్రాంతాన్ని నిర్ణయించడంతో ఆ ప్రాంతవాసులంతా ఆనందించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తమకు ఢోకా ఉండదని తెలుగుదేశం భావిస్తోంది. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న జగన్.. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రైతులను నిలువునా వంచించిందని ఆరోపిస్తున్నారు. పేదలు, దళితులకు చెందిన లంక భూములను సైతం లాక్కున్న చంద్రబాబు ప్రభుత్వం వారికి న్యాయం చేయడంలో మాత్రం నిఫలమైందని జగన్ మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే వేల లారీల ద్వారా లక్ష టన్నుల ఇసుకను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
ఎకరా 5 నుంచి 10 కోట్లు పలికే భూముల్ని ప్రభుత్వం తీసుకుని పరిహారం కింద.. కేవలం 1000 గజాల స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటోందని జగన్ విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధాని రైతు కుటుంబాలకు కల్పిస్తామన్న సదుపాయాలు, హామీలు ఏమీ నెరవేరలేదని జగన్ గుర్తు చేశారు. జగన్ సభలకు కూడా మంచి స్పందన వస్తుండటంతో తెలుగుదేశం శ్రేణుల్లో ప్రకంపనలు మొదలవుతున్నాయి.
హ్యాపీ సిటీస్ పేరుతో మూడు రోజులకు 52 కోట్లు దుర్వినియోగం చేశారని జగన్ తన పాదయాత్రలో విమర్శించారు. నేతల నుంచి కలెక్టర్ దాకా అంతా లంచాలమయంగా మారిందని జగన్ అంటున్నారు. మరి రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటన సీన్ రివర్స్ చేస్తుందా.. లేక రాజధాని వాసులు చంద్రబాబు వెంటే ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.