వైద్యం అందించే వైద్యులపైనా డెంగ్యూ అటాక్ చేస్తోంది. వైద్య
విద్య అభ్యసించడం కోసం వచ్చిన వారిలో చాలామంది విద్యార్థులు మంచంపడుతున్నారు. పదుల సంఖ్యలో జూనియర్ వైద్యులు విషజ్వారాలతో బెడ్ ఎక్కుతున్నారు. ఆస్పత్రిలోని సౌకర్యాల లేమిపై అధికారులకు మొరపెట్టుకున్నా...పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్దాసుపత్రి అయిన రిమ్స్ బోధానాసుపత్రిలో వైద్యం అందించాల్సిన జూనియర్ వైద్యులు బెడ్ పై చికిత్స పొందుతున్నారు. అదేంటి చికిత్స చేయాల్సిన వాళ్లు చికిత్స పొందుతున్నారనే కదా మీడౌట్. అవును జూనియర్ డాక్టర్లు విష జ్వరాల బారిన పడి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. రిమ్స్ పరిపాలన విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రిమ్స్ వైద్య కళాశాలలో 109 హౌజ్ సర్జన్ లుండగా ఇందులో 95 మంది విషజ్వరాల బారిన పడ్డారు. ఇక 400 మంది వైద్య విద్యార్థులుండగా అందులో 90మందికిపైగా రిమ్స్ లోనే చికిత్స పొందారు. ఇందులో కొందరు మెడిసిన్ వాడుతూ డ్యూటీ చేస్తుంటే...మరికొందరు మంచంపట్టారు. రెండు నెలల వ్యవధిలో 5 మందికి డెంగ్యూ పాజిటివ్ రాగా.. మరికొందరు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఇబ్బందిపడుతున్నారు.
తాజాగా ఐసీయూలో ఐదుగురు మెడికోలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సరైన సౌకర్యాలు లేకనే, ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిన పరిస్తితి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జూడా ప్రెసిండెంట్ ఆరోపిస్తున్నారు. సౌకర్యాల లేమితో ఉన్నామంటూ సమస్యలపై ఏకరువు పెడుతున్నారు. మెడికల్ కళాశాలలో చెత్తా, చెదారం పేరుకుపోవడం....నాలాలు క్లీన్ లేకపోవడం, ఏపుగా పిచ్చిమొక్కలు పెరగడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని మెడికోలు కోరుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. వైద్యులే అస్వస్థతకు గురైతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు.