మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. రేపు సాయంత్రంలోగా బలపరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. అంతే కాదు.. ఈ బలపరీక్షను లైవ్ టెలికాస్ట్ చేయాలని ఆదేశించింది. తక్షణమే ప్రొటెం స్పీకర్ ను నియమించి రేపటి లోగా బల పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అవకాశం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు రెండు రోజుల పాటు వాదనలు విన్నది. ఈ రోజు ఉదయానికి తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు చెబుతూ రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. 24 గంటల్లో బల పరీక్ష జరగాలని ఆదేశించింది.

 

 

కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ముగ్గురు న్యాయ మూర్తులు ఏకాభిప్రాయంతో చెప్పడం గమనార్షం. ఇక ఇప్పుడు రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ భరితంగా మారింది.

 

అయితే రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో ఫడణవీస్ సర్కారుకు ఎదురీత తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శివసేన కూటమి నిన్న ముంబైలోని ఓ హోటల్లో బలప్రదర్శన నిర్వహించింది. అందులో దాదాపు 160 మంది వరకూ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీన్ని బట్టి కూటమి బలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అజిత్ పవార్ వెంట పది మంది కంటే ఎక్కువ మంది సభ్యులు లేరు.

 

మహారాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్య 288. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే ఫడ్నవీస్ సర్కారుకు 145 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. బీజేపీకి సొంతంగా 105 ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో మ్యాజిక్ మార్కును అందుకోవడం బీజేపీకి కష్టసాధ్యమే. అయితే ఇక్కడ ప్రొటెం స్పీకర్ పాత్ర కూడా కీలకం కానంది. అందులోనూ అజిత్ పవార్ శివసేన శాసనసభపక్షనేతగా ఉన్నాడు. ఇలాంటి టెక్నికల్ అంశాల ఆధారంగా ఏదైనా మ్యాజిక్ చేయవచ్చేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: