ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ముకశ్మీర్‌ సహా పలుచోట్ల హై అలర్ట్‌ ప్రకటించాయి. ఉగ్రకుట్రలను తిప్పికొట్టేందుకు సెర్చ్‌ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి.

 

ఏ క్షణమైనా భారత్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని.. ఇంటలిజెన్స్‌ విభాగం.. భద్రతా దళాలకు సమాచారం అందించింది. దీంతో  సైన్యం అలర్టయ్యింది. ఆర్మీ అధికారులు కశ్మీర్‌లో మరోసారి హై అలర్ట్‌ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ సరిహద్దు దగ్గర 300 మంది ఉగ్రవాదుల కదలికలను నిఘా విభాగాలు గుర్తించాయి. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు సమాచారం అందడంతో.. భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి.  వీరిలో ఆఫ్ఘాన్‌కు చెందిన ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం. 

 

శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో మారోసారి పాకిస్తాన్‌ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దు దాటి వచ్చినందుకే కాల్పులు జరిపామని పాక్‌ ఆరోపించగా.. భారత ఆర్మీ తీవ్రంగా ఖండించింది. 

 

మరోవైపు పంజాబ్‌లోనూ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. కొన్ని రోజులుగా దేశ సరిహద్దులో పాకిస్థాన్‌ అనుమానిత డ్రోన్ లు  సంచరిస్తుండటంతో సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలెట్టారు. ఆ డ్రోన్లు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాలను జారవిడుస్తున్నట్టు అనుమానిస్తున్నారు. పంజాబ్‌ - హిమాచల్‌ - పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పంజాబ్‌ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పంజాబ్‌, పఠాన్‌కోట్‌ల మీదుగానే పాక్‌ డ్రోన్లు సరిహద్దును దాటి దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో నిఘా పెంచారు. హిమాచల్‌ అటవీ ప్రాంతంలో పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. నివాస స్థావరాల్లోనూ గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వారి గుర్తింపు కార్డులను సైతం తనిఖీ చేశారు. ఉగ్రకుట్రలను తిప్పికొట్టేందుకు సెర్చ్‌ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: