ఏపీ శాసనమండలి రద్దు చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుండి హోం శాఖ..న్యాయ శాఖతో పాటుగా ఎన్నికల సంఘానికి మండలి రద్దు బిల్లు చేరుకుంది. అయితే ఇక్కడ నుంచే ఊహించని ట్విస్టులు ఎదురయ్యేలా కనిపిస్తుంది. అసలు ఈ మండలి రద్దుపై ఇప్పుడు కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఒకవేళ బీజేపీ దీనిపై పాజిటివ్‌గా ఉంటే వెంటనే లోక్ సభలో బిల్ పెట్టేసి పాస్ చేయించేస్తుంది.

 

అయితే ఈ బిల్ రాజ్యసభకు వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి మెజారిటీ తక్కువ...కాంగ్రెస్ సహ మిగతా విపక్షాలకు బలం ఎక్కువ. కాకపోతే ఇక్కడ అంశాన్ని బట్టి పలు విపక్షాలు బీజేపీ పెట్టే బిల్లుకు ఆమోదం తెలుపుతాయి. ఇటు అమిత్ షా కూడా కీలక బిల్లుల సమయంలో లాబీయింగ్ చేసి విపక్ష పార్టీల మద్ధతు తీసుకుంటారు. తాజాగా కూడా పౌరసత్వ బిల్లు సందర్భంగా అమిత్ షా...టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ సహ పలు పార్టీల మద్ధతు తీసుకుని బిల్లు గట్టెక్కించుకున్నారు.

 

అయితే ఏపీ మండలి రద్దు బిల్లుకు ఎవరు మద్ధతు తెలుపుతారనేది తెలియడం లేదు. మండలి అనేది రాష్ట్ర పరంగా పెద్దల సభే. మరి దాని రద్దు దేశ పెద్దల సభ అయిన రాజ్యసభలో జరుగుతుందా అంటే? చెప్పలేని పరిస్తితి. అసలు జగన్‌తో స్నేహం చేస్తున్న కేసీఆర్ కూడా మద్ధతు ఇవ్వడం కష్టమని తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో భారీ షాకే ఇవ్వొచ్చని, ఆ పార్టీ సీనియర్ ఎంపీ కే కేశవరావు మాటలు బట్టి అర్ధమవుతుంది. తాజాగా ఆయన మండలి రద్దుని వ్యతిరేకించారు. 

 

జాతీయస్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనైనా పెద్దల సభలు ఉండాల్సిందేనని, మండలి వల్ల ఆర్ధిక భారం అవుతుందనే విషయం నాన్‌సెన్స్ అని మాట్లాడారు. రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడుగా ఉన్న కే‌కే ఇలా అన్నారంటే, భవిష్యత్‌లో ఏపీ మండలి రద్దు బిల్లు రాజ్యసభకు వస్తే టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే కేసీఆర్‌తో ఉన్న స్నేహం మేరకు జగన్ అనుకూలంగా మార్చుకునే అవకాశముంది. చూడాలి మరి జగన్‌కు కేసీఆర్ షాక్ ఇస్తారో? సపోర్ట్ ఇస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: