ఏపీ సీఎం జగన్ మరో హామీ అమలు దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన జగన్ విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కోసం 2,300 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 20,000 రూపాయల చెప్పున చెల్లించనుంది. 
 
సీఎం జగన్ ఉన్నత చదువులు చదువుతున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం రెండు దఫాలుగా ఈ నగదును విద్యార్థులకు ఇవ్వనుంది. ఐటీఐ చదువుతున్న వారికి మొదటి దఫా 5000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి మొదటి దఫా 7500 రూపాయలు, డిగ్రీ ఆ పైన చదువుతున్న వారికి 10,000 రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. 
 
ఈ పథకానికి 11,61,244 మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. గత ప్రభుత్వం మెయింటెనెన్స్ ఫీజుల కోసం 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగా వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి గత ప్రభుత్వం కంటే అదనంగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందాలంటే 20,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది. 
 
అందుకే ఈ పథకం విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఎం జగన్ విజయనగరంలో ఈ పథకాన్ని ప్రారంభించనుండటంతో పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో సీఎం జగన్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు, కరెస్పాండెన్స్, దూర విద్య, మేనేజ్ మెంట్ కోటాలలో సీట్లు పొందిన వారికి ఈ పథకం వర్తించదని గతంలోనే స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: